 
															ఆఖరి మజిలీకి అవస్థలు
పెద్దదోర్నాల: తుఫాన్ ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడ్డారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఐనముక్కల గ్రామానికి చెందిన ఓ రైతు గురువారం ఉదయం మృతి చెందాడు. అయితే భారీ వర్షానికి శ్మశాన వాటిక మొత్తం బురదమయం కావడంతో అంతిమ సంస్కారాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాలి లోతు బురద గుంతలో అష్టకష్టాలు పడుతూ అంత్యక్రియలు పూర్తి చేశారు.
నాగులుప్పలపాడు: తుపాను బాధితుల ఎంపికకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఆ సమయంలో బురద రాజకీయానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోంథా తుపాను ప్రభావంతో తిమ్మసముద్రం గ్రామానికి నాలుగు వైపులా ఉన్న కాలువలు, చెరువులు తెగిపోయాయి. దీంతో గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలతో పాటు సగం గ్రామం రెండు రోజులుగా నీటి ముంపులో మునిగిపోయింది. ఈ క్రమంలో గురువారం ముంపునకు గురైన లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నష్టపోయిన వివరాలు సేకరించారు. అనంతరం అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు సచివాలయానికి వచ్చారు. జాబితాను చూపించాలని కోరారు. అర్హుల జాబితాను పక్కాగా సిద్ధం చేస్తున్నామని అధికారులు వారి చెప్పారు. అదే సమయానికి అక్కడకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు పక్కాగా అర్హుల జాబితాను తయారు చేయాలని, అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గదంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు ఇచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
చీమకుర్తి: మొంథా తుపాను బాధితులకు ఇంకా సాయం అందలేదు. కేవలం జీఓ మాత్రమే వచ్చింది. కానీ పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధిత కుటుంబాలను మాత్రం ఇళ్లకు పంపించేశారు. చీమకుర్తి మండలంలో మొత్తం 5 సెంటర్‌లలో ఏర్పాటు చేశారు. చీమకుర్తి పట్టణంలో 100 మంది, కూనంనేనివారిపాలెంలో 84 మంది, జీఎల్‌పురంలో 16 మంది, తొర్రగుడిపాడులో 35 మంది, పులికొండలో 38 మందిని పునరావాస కేంద్రాలలో చేర్పించారు. మొత్తం 76 కుటుంబాల తరఫున 273 మందిని పునరావాస కేంద్రాల్లో చేర్పించారు. వర్షాలు తగ్గిన తరువాత వారంతా ఇళ్లకు వెళ్లినా ఇంత వరకు సాయం అందలేదు.
 
							ఆఖరి మజిలీకి అవస్థలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
