 
															తుపాను జాగ్రత్తల్లో ప్రభుత్వం విఫలం
యర్రగొండపాలెం: రాష్ట్రాన్ని తుపాను అతలాకుతలం చేస్తుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా అవేమీ పట్టనట్లు కూటమి ప్రభుత్వం కునుకు వహించిందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోంథా తుపాను ప్రజలకు తీరని నష్టం కలుగజేసిందని, పంటలన్నీ నదులుగా, రోడ్లు సెలేయర్లుగా, ఇళ్లు నీటి కుంటలుగా మార్చివేసిందన్నారు. ఇటువంటి పరిస్థితిని వాతావరణ శాఖ వారం రోజుల ముందే పసికట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించినా..కూటమి ప్రభుత్వం సరైన రీతిలో చర్యలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. 2014–19 మధ్య వచ్చిన తుపాన్లకు 50 మంది మృతి చెందారని, అప్పట్లో కూడా ముందస్తు చర్యలు తీసుకోకుండా
విపత్తులను సమర్ధంగా ఎదుర్కొన్న జగనన్న
2019–24లో వచ్చిన 7 తుఫాన్లను అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని, అప్పట్లో ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో విపత్తులు సంభవిస్తే సచివాలయాల వ్యవస్థ ద్వారా తక్షణ సహాయం కింద రూ. 3వేలు, రేషన్ కిట్, ఇంట్లో నష్టం జరిగితే రూ.10 వేలు, రూ.20 వేల ప్రకారం, పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేలు, మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ప్రకటించి తినటానికి, ఉండటానికి, తాగునీటి వసతులు కల్పించేందుకు కలెక్టర్ల పర్యవేక్షణలో సహాయ కార్యక్రమాలు చేపట్టారన్నారు.
సైంటిస్టుల్లా తండ్రీకొడుకులు
సహాయక చర్యలు చేయాల్సిన సమయంలో చంద్రబాబు, లోకేష్‌లు రాకెట్‌లను లాంచ్ చేసే సైంటిస్టుల్లా కంప్యూటర్ల ముందు కూర్చొని, ఫొటోలకు ఫోజులిచ్చారని ఎద్దేవా చేశారు. తుపాను రివ్యూలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ, సివిల్ సప్లయ్ మంత్రులు లేకుండా విద్యాశాఖ మంత్రి లోకేష్ సమావేశంలో పాలుపంచుకొని ఆయన సకల శాఖా మంత్రి అని చెప్పుకునే ప్రయత్నం చేయడమే కాదా అని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత లేకుండా రివ్యూ మీటింగ్‌లలో పాల్గొనకపోవడం ఆయన నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, షేక్.మహమ్మద్ ఖాశిం, వై.రోషిరెడ్డి, రాములు నాయక్, సారా, ఒంగోలు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
