రైతులకు తెలియకుండా పొలాల్లో విద్యుత్ లైన్ ఏర్పాటు కాంట్రాక్టర్‌పై మండిపడిన రైతులు
బేస్తవారిపేట: మండలంలోని పెంచికలపాడులో రైతుల పొలాల్లో నుంచి అక్రమంగా ఇండస్ట్రియల్ అవసరాల కోసం లాగుతున్న విద్యుత్ లైన్‌ను రైతులు అడ్డుకున్న సంఘటన ఆదివారం జరిగింది. కొమరోలు మండలం ముత్తరాసుపల్లెలో ఒకరు మొక్కజొన్న ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం బేస్తవారిపేట మండలం పెంచికలపాడు నుంచి హైవేరోడ్డు వెంట ఎంతో విలువైన రైతుల పొలాల్లోంచి విద్యుత్ స్తంభాలు వేసి, మొక్కజొన్న పంటను జేసీబీలతో తొక్కించి విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ లైన్ ఎలా ఏర్పాటు చేస్తున్నారని కాంట్రాక్టర్‌ను ఆదివారం రైతులు నిలదీశారు. ఇప్పటికే ఈ పొలాల గుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళ్తోంది. ఇప్పుడు మరో విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తే విలువైన తమ పొలాలు ఎందుకూ పనికిరాకుండా పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ ఏర్పాటుకు ఎంత నగదు చెల్లించారు, విద్యుత్ శాఖ అధికారులు ఎస్టిమేషన్ ఎంత వేశారు? అగ్రిమెంట్ ఎవరికి ఇచ్చారంటూ కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతానికి మా వద్ద ఏమీ లేవని, రేపు డిపార్ట్‌మెంట్ వాళ్లు తీసుకొస్తారని సమాధానమిచ్చాడు. పనులు జరిగే ప్రదేశం వద్ద గిద్దలూరు ఏఈ ఉన్నారు. కొమరోలు, బేస్తవారిపేట మండలాల పరిధిలో పని జరుగుతున్నప్పుడు గిద్దలూరు ఏఈ ఇక్కడ ఉండి పనులు చేయిస్తుండటంపై రైతులు నిలదీశారు. ఇక్కడెందుకు ఉన్నారని నిలదీయడంతో దారిలో పోతూ నిలబడ్డానని చెప్పడంతో మండిపడ్డారు.