
మానుకోకుంటే ఖబడ్దార్
మహిళలపై దాడులు
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంటి నుంచి బయటకు రావాలంటే మహిళలు భయపడుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విమర్శించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం, జనసేన గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక బీసీ మహిళా నాయకురాలు, జిల్లాకే ప్రథమ పౌరురాలి మీద దాడి చేయడం, ఆమె కారు అద్దాలను పగులగొట్టి, రాళ్లతో దాడులు చేసి ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. హారికను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా హతమార్చేందుకే ఈ దాడి జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. గుడివాడలో జరిగిన దాడి దృశ్యాలను టీవీల్లో చూసిన రాష్ట్ర ప్రజలు, మహిళలు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోవడం సిగ్గుచేటన్నారు. హారిక మీద దాడిని హోంమంత్రి ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. మహిళల మీద దాడులు చేయడమేనా మంచి ప్రభుత్వమంటే అని చురకలంటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే జెడ్పీ చైర్ పర్సన్ల గన్‌మెన్లను తొలగించారని, వారిని కొనసాగించి ఉంటే నేడు ఈ దాడి జరిగేదే కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జనంలోకి వస్తుంటే మీకెందుకింత భయం అని నిలదీశారు. జగన్ పర్యటనలకు వేలాదిగా జనం తరలిరావడాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం వణికిపోతుందని ఎద్దేవా చేశారు. రేపు తాము అధికారంలోకి వస్తామని, ఈ రోజు గుండాయిజం చేసిన వాళ్లకు తగిన పాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, మీ ధోరణి మార్చుకోకుంటే ఇంతకింత అనుభవిస్తారని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ సమావేశాలకు హాజరవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హారిక మీద టీడీపీ గూండాలు దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మహిళలను ఏదైనా మాట అంటే ఊరుకోనన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీపీ గాయం సావిత్రి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి రవణమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ అఫ్సర్, వాలంటీర్ విభాగం రాష్ట్ర కార్యదర్శి గోనెల మేరీ కుమారి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, నియోజకవర్గ అంగన్‌వాడీ అధ్యక్షురాలు వడ్లమూడి వాణి, సిటీ మహిళా అధ్యక్షురాలు బత్తుల ప్రమీల, మద్దలూరు సర్పంచ్ కె.రమణ, నాగమణి, నాగలక్ష్మి, బి.శైలజ, కె.లక్ష్మి పాల్గొన్నారు.
మహిళలపై దాడులు చేయడమేనా మంచి ప్రభుత్వమంటే జెడ్పీ చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుంటే ఇక సామాన్య మహిళల పరిస్థితేంటి ఇదే ధోరణి కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ