
దేవుడి పేరుతో వేలంపాటలు..
జిల్లాలో అనేక గ్రామాల్లో దేవుడి పేరుతో బెల్టు షాపులను వేలం పాటలు వేస్తారు. గిద్దలూరు నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో వేలంపాట పెట్టుకొని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. బేస్తవారిపేట మండలంలోని పెద్ద ఓబినేనిపల్లె, చిన ఓబినేనిపల్లె, జేసీ అగ్రహారం, ఎంపీ చెరువు, బసినేపల్లి, గంటాపురం, కొత్తపేట, పీవీపురం, గలిజేరుగుళ్ల, పూసలపాడు గ్రామాల్లో దేవుడి పేరుతో వేలం పాటలు వేసి బెల్టు షాపులు దక్కించుకున్నారు. ఒక్కో గ్రామానికి అక్కడి జనసాంద్రత, ఆర్థిక స్థితిగతులను బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వేలం పాడుకున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో రూ.2.5 లక్షలకు వేలం పాడినట్లు సమాచారం. మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం తుమ్మల చెరువులో పీర్ల పండుగ సందర్భంగా వేలం పాట నిర్వహించారు. కేవలం మూడు రోజులకు గాను రూ.3 లక్షలకు పాట పాడినట్లు ప్రచారం జరుగుతోంది. సింగరాయకొండ మండలంలోని మత్స్యకార గ్రామాల్లో కూడా వేలం పాటలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో వేలం వేసి వచ్చిన సొమ్ముతో గ్రామాభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక్కడ రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు వేలం పాట వేసినట్లు తెలుస్తోంది. వేలం పాటలో బెల్టు షాపులు దక్కించుకున్న వారు మాత్రమే ఇక్కడ మద్యం విక్రయించాలి. బాటిల్ మీద రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసే అధికారం కూడా నిర్వాహకుడికి ఉంటుంది.