
మద్యం విక్రయ కేంద్రాలుగా మారిన దాబా హోటళ్లు...
రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న దాబా హోటళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎటు చూసినా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన అనేక దాబా హోటళ్లు వెలిశాయి. రాత్రయితే చాలు దాబా హోటళ్లు మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ వారు తాగి తందనాలాడటానికి సిటింగ్ ఏర్పాటు ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారాయి. దీంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో వెంగముక్కలపాలేనికి వెళ్లే దారిలో ఉన్న ఒక దాబాలో అర్ధరాత్రి జరిగిన గొడవ రణరంగాన్ని తలపించింది. బిల్లు చెల్లించే విషయంలో హోటల్ నిర్వాహకులు, కస్టమర్లకు మధ్య చోటుచేసుకున్న వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు చితక్కొట్టుకున్నారు. దాబా హోటళ్లు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో మద్యం తాగే ఏర్పాటు చేయడం, అర్ధరాత్రి వరకు హోటళ్లు నిర్వహించడం, మద్యం తాగే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం, మందుబాబులకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం లాంటివి జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, నెలవారీ మాముళ్లు తీసుకుంటూ వీటిని పోలీసులు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ మద్దతు ఉండడంతో దాబా నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.