
చిక్కుముళ్లు!
వివాహ ధ్రువీకరణకు
కంభం: మూడు ముళ్ల బంధానికి ధ్రువీకరణ పత్రం పొందాలంటే సాంకేతిక చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. ఏ కులం వారికై నా వివాహం చేసుకోడానికి అర్హత వయసు వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకునే సమయంలో మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నిబంధనలు పెట్టడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న వారు తమ భార్య వివరాలు రికార్డుల్లో నమోదు చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. అందులో మొదటిది హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్, రెండోది స్పెషల్ మ్యారేజ్ సర్టిఫికెట్. హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్ పొందేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ స్పెషల్ కేటగిరీ కిందకు వచ్చే ముస్లింలు, క్రిస్టియన్లు వివాహ ధ్రువీకరణ పత్రం పొందలేక అవస్థలు పడుతున్నారు.
దరఖాస్తులోనే తిరకాసు!
హిందూ మ్యారెజ్ సర్టిఫికెట్ అవసరమైన వారు దరఖాస్తు చేసే సమయంలో పెళ్లికూతురి వయసు 18 ఏళ్లు ఉంటే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసేందుకు వీలవుతోంది. అయితే స్పెషల్ మ్యారెజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ముస్లింలు, క్రిస్టియన్ వర్గాలకు చెందిన యువతుల వయసు 18 ఏళ్లు నిండినా వైబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచేందుకు అవకాశం ఉండటం లేదు. పెళ్లి కుమార్తె వయసు కచ్చితంగా 21 ఏళ్లు ఉండాలని వెబ్‌సైట్‌లో స్పష్టం చేయడంతో తలపట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ‘తాము ఏమీ చేయలేం, ఆన్‌లైన్‌లో ఉన్న దాని ప్రకారం దరఖాస్తు చేసుకోండి’ అని సూచిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
ఉద్యోగులకూ తిప్పలు
ఆర్మీ ఉద్యోగులతోపాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి. అదే విధంగా ఆధార్, రేషన్ కార్డులో వివరాల నమోదుకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరమవుతోంది. అయితే స్పెషల్ కేటగిరీ వర్గాలకు చెందిన యువతులకు 21 ఏళ్ల వయసు నిబంధన విధించడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. ఇదిలా ఉండగా నిరక్షరాస్యులు వయసు ధ్రువీకరణ తెలియజేసే అవకాశం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
స్పెషల్ మ్యారేజ్ సర్టిఫికెట్ల జారీలో సాంకేతిక సమస్య
ఆ కేటగిరీ కింద ముస్లింలు, క్రిస్టియన్లు
వివాహానికి అర్హత వయసు యువతులకు 18, యువకులకు 21 ఏళ్లు
స్పెషల్ కేటగిరీలో యువతులకు 21 ఉంటేనే దరఖాస్తుకు అవకాశం
ఈ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు