
ప్రభుత్వరంగ సంస్థలను రంగంలోకి దింపాలి
ఒంగోలు సిటీ: పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే రంగంలోకి దింపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఒంగోలు పరిధిలోని పేర్నమిట్ట, త్రోవగుంట వేలం కేంద్రాలను బుధవారం సంఘం బృందం పరిశీలించారు. రెండు వేలం కేంద్రాల్లో వేలంలో పాల్గొన్న బయ్యర్లు ఏ ఒక్కరూ కూడా లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకపోవడంపై రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జుజ్జూరి జయంతిబాబు, పమిడి వెంకటరావు, ఉపాధ్యక్షుడు పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు అక్షేపణ వ్యక్తం చేశారు. రైతులు తీసుకువస్తున్న బేళ్లలో 50 శాతం బేళ్లు తిరస్కరిస్తే రైతులకు ఎంత నష్టం కలుగుతుందో తెలుసా అని నిర్వాహకులను ప్రశ్నించారు. కనిష్ట ధర రూ.200 తగ్గించడం దారుణమన్నారు. గత ఏడాది రూ.360 చొప్పున కొనుగోలు చేసిన కంపెనీలు ఈ ఏడాది ఎందుకు కొనుగోలు చేయడం లేదని కంపెనీ ప్రతినిధులను, వేలం నిర్వహణాధికారి జె.తులసిని ప్రశ్నించారు. 160 మిలియన్ కిలోల పొగాకుకు బోర్డు అనుమతించిందని, కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది చాలా స్వల్పమన్నారు. కంపెనీలకు విదేశీ ఆర్డర్లు రానందున కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, ఈ నెలాఖరుకు విదేశీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని కంపెనీలు చెబుతున్నాయని నిర్వహణాధికారి తులసి పేర్కొన్నారు. కంపెనీల యాజమాన్యం సూచనల మేరకు లో గ్రేడ్ కొనుగోలు చేయడం లేదని బయ్యర్ల ప్రతినిధులు పేర్కొన్నారు. మార్కెట్ ఇదే రీతిలో కొనసాగితే 90 శాతం మంది రైతులకు బ్యారన్‌కు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోతారని తెలిపారు. వేలం ప్రారంభంలో రూ.240 ఉన్న కనిష్ట ధర పది రోజుల్లోనే రూ.200 పడిపోవడం వెనుక బయ్యర్ల సిండికేట్ అయినట్లు తెలుస్తుందన్నారు. రైతు సంఘ నేతలు బెజవాడ శ్రీనివాసరావు, కరిచేటి హనుమంతరావు, కిలారి పెద్దబ్బాయి, సుబ్బారావు పాల్గొన్నారు.
నిత్యం వందలాది బేళ్లను తిరస్కరిస్తే ఎలా..? లో గ్రేడ్ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలి వేలం కేంద్రాలను పరిశీలించిన రైతు సంఘం ప్రతినిధులు