
ఒకే ఫొటోతో 50 మందికి మస్టర్
మార్కాపురం:
నిన్న కొనకనమిట్ల... నేడు మార్కాపురం... కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పధకంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, కూటమినాయకుల పెత్తనం వెరసి ఉపాధి హామీ పథకం చిత్ర విచిత్రంగా జరుగుతోంది. ఏరోజు ఎవరికి ఎలా మస్టర్ వేస్తారో.. ఆ దేవుడికి కూడా అర్థం కావడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టం వచ్చినట్లుగా ఫొటోలు తీసి అప్‌లోడ్‌చేస్తూ కూటమి నాయకుల మెప్పు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే. మండలంలోని బోడపాడు గ్రామంలో రామన్నకుంటలో నీటికుంట తవ్వేందుకు పనులు చేపట్టారు. అయితే ఒకే ఫోటోతో 50 మందికి మస్టర్లు వేయడం పెద్దఎత్తున విమర్శలకు తావిస్తోంది. ఫీల్డు అసిస్టెంట్ కె.శ్రీనివాసులు ఒకే ఫొటోతో 50 మందికి మస్టర్లు వేసి అప్‌లోడ్ చేశారు.
పనికి హాజరైన కూలీల ఫొటోలనే అన్నీ మస్టర్లకు చూపడం గమనార్హం.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
కేవలం అధికారపార్టీ నాయకుల జేబులు నింపేందుకే ఉపాధిహామీ పథకం తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలను వదిలి బయటకు రాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు వేసిందే మస్టరు... పంపిందే ఫొటో... వచ్చిందే వేతనం.. లాగా తయారైంది. కూలీలు రాకపోయినా, మస్టర్ వేస్తూ కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పథకం నిర్వహణపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారు. అలా జరిగిందా.. జరగదే.. చూస్తాంలే అంటూ సమాధానాలు దాటవేస్తున్నారు. కొంతమంది సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పనులకు రాకపోయినా వచ్చినట్లుగా మస్టర్ వేసి వారి వద్ద నుంచి కమీషన్లు తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
అలా జరిగే అవకాశం లేదు:ఏపీఓ
ఈ విషయమై మార్కాపురం ఏపీఓ నాగరాజును వివరణ కోరగా అలా జరిగే అవకాశం లేదని, కూలీలు హాజరైనా హడావుడిలో ఒకే ఫొటోతో మస్టర్ వేసి ఉండవచ్చని, అయినా కచ్చితంగా విచారణ చేస్తానని చెప్పారు.
ఉపాధిహామీలో చిత్రవిచిత్రాలు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

ఒకే ఫొటోతో 50 మందికి మస్టర్