
భూ సేకరణ వేగవంతం చేయండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: జిల్లా నుంచి వెళుతున్న ప్రధాన రహదారులు, రైల్వే మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో కలిసి సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రహదారులు, రైల్వే మార్గాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని పూర్తి చేయాలన్నారు. 565, 544(డీ), 167 (బి). 765, 544 (జి) జాతీయ రహదారులు, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గాల నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించారు. ఆయా నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ కోసం నిధుల చెల్లింపు, పెండింగ్ క్లెయిమ్స్, యాజమాన్య హక్కుల వివాదాలపై కలెక్టర్ ఆరా తీశారు. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. వీటి పురోగతిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, నిధుల చెల్లింపులపై కలెక్టర్ ఆరా తీశారు. కొత్తపట్నం మండలంలో ఫిష్షింగ్ హార్బర్ ఏర్పాటుకు భూ సేకరణపై సమావేశంలో చర్చించారు. పాదర్తి, గుండాయపాలెం, పిన్నివారిపాలెం తదితర గ్రామాల్లో భూముల లభ్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరాన్ని బట్టి వాటిని సేకరించే విషయంలో ఒక స్పష్టత తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో డీఆర్‌ఓ బి.చినఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, కనిగిరి ఆర్‌డీఓ వెంకట శివరామిరెడ్డి, ఒంగోలు ఆర్‌డిఓ లక్ష్మీ ప్రసన్న, పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.