పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

May 20 2025 1:36 AM | Updated on May 20 2025 1:52 AM

పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

పొదిలి రూరల్‌: పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ విమర్శించారు. సోమవారం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని వారు సందర్శించారు. వారికి పూలమాలలతో రైతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేలం బిడ్డింగ్‌లో పొగాకు కొనుగోళ్ల తీరును పరిశీలించి అధికారులు, రైతులతో మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై తీవ్ర మనోవేదనతో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అప్పల బాధలు తట్టుకోలేక ఇటీవల పర్చూరు నియోజకవర్గంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు కంపెనీల ప్రతినిధులు రైతులను ప్రోత్సహించి పంట సాగు చేయించారని, తీరా కొనుగోళ్ల సమయంలో వారు కనిపించకపోవడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అప్‌గ్రేడ్‌ ఉన్న ఎస్‌–2, ఎఫ్‌–1 రూ.240 నుంచి రూ.250కి కూడా అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, కానీ, పంటలు పండించే రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు...

సూపర్‌సిక్స్‌ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినప్పటికీ రైతుల గురించి పట్టించుకోకపోవడంతో మిర్చి, పొగాకు, ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ ద్వారా సుమారు రూ.100 కోట్లు వెచ్చించి పొగాకు కొనుగోళ్లు చేయించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం లో గ్రేడ్‌ అని చెప్పి నో బిడ్‌ కింద వెనక్కి పంపిస్తున్నారని, పొగాకు ధరలు దారుణంగా పడిపోయి రైతులు అప్పల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడి ఎక్కువై పంట దిగుబడి కూడా తగ్గిందన్నారు. దీనికితోడు పొగాకు బోర్డు కొనుగోలు చేసే రేట్లు కూడా తగ్గడం వలన రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుకు అన్నిరకాలుగా అండగా నిలబడిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం దుర్మార్గంగా ప్రైవేటు వ్యాపారులు వారికిష్టమైన రేట్లు ఇవ్వడం వలన రైతాంగం పూర్తిగా నష్టపోతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃపరిశీలన చేసి గత ప్రభుత్వ విధానాలు అవలంబించి రైతులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి గిరిరాజ్‌కుమార్‌, అధికారులు, పొదిలి, కొనకనమిట్ల మండలాల వైఎస్సార్‌ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, జి.శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, ఎం.మురళి, గుజ్జుల సంజీవరెడ్డి, ఫిరోజ్‌, రైతులు పాల్గొన్నారు.

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పొదిలి పొగాకు వేలం కేంద్రం సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement