
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు
మార్కాపురం: సీఎం చంద్రబాబుకు పాలన చేతగాక హామీల అమలులో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. హామీల అమలు విషయంలో అన్నీ వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకున్నా మద్యం స్కామ్ జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని జంకె ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో బెల్టుషాపులు పూర్తిగా రద్దు చేసి మద్యం షాపులను తగ్గించి అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్నీ డిస్టలరీలకు చంద్రబాబే అనుమతులు ఇచ్చారని, వైఎస్సార్ సీపీ పాలనలో ఒక్క డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. వీధి వీధినా బెల్టుషాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్, లిక్కర్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్‌మెంటు కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో పాలన వెనక్కి వెళ్లిందన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం బెదిరింపులతో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం లేదని, అరాచక పాలనతో ప్రజా చైతన్యాన్ని అడ్డుకోలేరన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని జంకె హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే జంకె