
అవినీతి..!
చిత్రమైన
బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన ద్వారకచర్ల రవికుమార్‌రెడ్డి, సావిత్రి దంపతులు హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. రవికుమార్‌రెడ్డి ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఆయన పేరుపై మోక్షగుండంలో ఉపాధి హామీ జాబ్‌కార్డు ఉంది. ఇదే గ్రామానికి చెందిన సీహెచ్ సునీత, తిరుపతిరెడ్డి గుంటూరులో నివాసం ఉంటుంటారు. పోలయ్య, లక్ష్మీదేవి కడప, నాగేశ్వరరెడ్డి, మధులత విజయవాడలో ఉంటారు. ఆవుల జ్యోతి, రమణారెడ్డి కర్ణాటకలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరందరికీ వారి స్వగ్రామాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. అంతేగాకుండా వారు ప్రతిరోజూ పనులు చేస్తున్నట్లు హాజరు వేస్తున్నారు. ఇంకా చిత్రమేమిటంటే అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా వారి స్వగ్రామాల్లో ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీల నేతలు ఉపాధి హామీ పథకాన్ని హైజాక్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులను పట్టుబట్టి మరీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకుని అక్రమాలకు తెరదీశారు. అందినకాడికి మేసేస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో వారానికి రూ.3 కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించడం సంచలనం సృష్టించింది. దీంతో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
జిల్లాలో దోపిడీ ఇలా...
జిల్లాలో మొత్తం 4.42 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 2024–25లో కోటీ 29 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 3 లక్షల కార్డులకు చెందిన 5.06 లక్షల మంది పనులు చేసినట్లు చెబుతున్నారు. రికార్డుల్లో ఇదంతా బాగానే ఉంది. కానీ, వాస్తవంలో మాత్రం అధికారులు చెబుతున్న దానికి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి మే నెలలో 3 లక్షల మందికిపైగా పనులు చేయాల్సి ఉంది. కానీ 1.80 లక్షల మంది మాత్రమే పనులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మిగతా 1.20 లక్షల మంది ఎందుకు పనులకు రావడం లేదంటే అధికారుల నుంచి సమాధానం లేదు.
వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు...
ఉపాధి హామీ పనులు చేసేవారికి గతంలో 14 రోజులకు ఒకసారి వేతనాలు ఇచ్చేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గత మార్చి 16వ తేదీ వరకు చేసిన పనుల తాలూకా వేతనాలు ఇటీవలే ఇచ్చారు. తిరిగి మార్చి 17 నుంచి చేసిన పనులకు ఇంత వరకు ఇవ్వలేదు. 60 రోజులు కావస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలీలు అవస్థపడుతున్నారు. నిధులున్నా ఉద్దేశపూర్వకంగానే వేతనాలు ఇవ్వడం లేదని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రతోనే కూటమి ప్రభుత్వం వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వం కనీస వేతనం రూ.307 ప్రకటించింది. కానీ, ఎవరికీ కనీస వేతనం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చేసిన పనులకు కొలతలు వేసి వేతనం ఇవ్వడం జరుగుతోంది. దీని ప్రకారం ఒక్కొక్కరికి రూ.200 దక్కడమే మహాభాగ్యమని ఉపాధి కూలీలు చెబుతున్నారు.
ఒకటే ఫొటో.. పది బిల్లులు...
ఉపాధి హామీలో కూలీల గ్రూపు ఫొటో చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందేనని చెబుతున్నారు. కూలీలతో పనులు చేయించినట్లు ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో గ్రూపు ఫొటోలు పెట్టాల్సి ఉంటుంది. అయితే, పది మందితో పది గ్రూపుల ఫొటోలు సృష్టిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పని ప్రాంతంలో దగ్గరగా ఉన్న వారిని ఫొటోలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఆశా వర్కర్లు, వికలాంగులు, చిన్నపిల్లలు, వృద్ద్ధుల ఫొటోలు తీసుకుని అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక ఫొటోను అనేక పంచాయతీలలో అప్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదంతా జిల్లా అధికారులకు తెలియదా అంటే.. అంతా తెలిసే జరుగుతుందనే మాట వినిపిస్తోంది. మరి జిల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే నెలనెలా మామూళ్లు తీసుకుని చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అవినీతే ఉపాధి హామీకి శాపంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉపాధి హామీ పథకంలో పెచ్చుమీరిన అక్రమాలు అందినకాడికి మేసేస్తున్న పచ్చ తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా జాబ్‌కార్డుల నమోదు పనులు చేయకుండానే కూలి దొంగ మస్టర్లతో జేబులు నింపుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వారానికి రూ.3 కోట్లు పంచుకుంటున్నారు : డీఆర్‌సీలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి

అవినీతి..!