
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
చీమకుర్తి రూరల్: ఒకసారి ప్రజలకు మాటిస్తే కచ్చితంగా నెరవేర్చే వ్యక్తి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కొనియాడారు. కానీ, సీఎం చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కూటమి ప్రభుత్వంపై 11 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. చీమకుర్తి మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ 24వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభపై బూచేపల్లి పాల్గొన్నారు. పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవితో కలిసి పాల్గొన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా జగనన్న అండగా నిలిచారని తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా మనమంతా సమష్టి కృషితో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవాలని అన్నారు.
వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రం సస్యశ్యామలం :
మేరుగు నాగార్జున
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంటుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున అన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందాయన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలు, మహిళల గురించి పట్టించుకునేవారే లేరన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలివ్వకపోవడంతో నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకుండా అన్నదాతలను నిలువునా మోసం చేస్తోందన్నారు. ప్రజలంతా 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని అన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా.. ఇచ్చిన హామీల ఊసే లేదన్నారు. స్కీములు లేకపోగా, స్కాములు మాత్రం ఉంటున్నాయన్నారు. అధికారం ఉన్నా..లేకున్నా జగనన్న సింగిల్‌గా పోటీచేసే దమ్మున్న నాయకుడని అన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి 2029లో జగనన్నను సీఎం చేసుకుంటేనే పేద ప్రజలకు అండగా దొరుకుతుందని అన్నారు. కార్యక్రమంలో చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాయకులు శివన్నారాయణ, యర్రగుంట్ల వసంతరావు, యర్రగుంట్ల మోహన్, డాక్టర్ బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, నల్లూరి చంద్రారావు, గోరంట్ల రామకృష్ణ, వేమూరి బాలకృష్ణ, పేరాబత్తిన పేరయ్య, పాటిబండ్ల గంగయ్య, ఏలూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
11 నెలల్లోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు సూపర్ సిక్స్ హామీలిచ్చి నెరవేర్చని చంద్రబాబు పేదలు, మహిళలను మోసం చేయడం అన్యాయం మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందాం ఇచ్చిన మాట నెరవేర్చే వ్యక్తి జగనన్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు అండగా నిలిచారు రాష్ట్రానికి మళ్లీ జగనన్నే కావాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత