
ఆశా వర్కర్లపై కర్రపెత్తనం తగదు
● ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి
ఒంగోలు టౌన్: ఆశా వర్కర్లపై కర్రపెత్తనం తగదని, ఏఎన్‌ఎంల నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు పెత్తనం చలాయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి అన్నారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన యూనియన్ జిల్లా సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆశా వర్కర్ల సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని చెప్పారు. కోవిడ్ సమయంలో ఆశాలు అందించిన సేవలను ప్రజలు ప్రశంసించారన్నారు. 20 ఏళ్లుగా ఎన్‌హెచ్‌ఎం విభాగంలో ఆరోగ్య సేవలందిస్తున్నారని, ప్రతి కాన్పు ఆస్పత్రిలో జరిగే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. 2007లో యూనియన్ ఏర్పడిన తర్వాత జీతాల కోసం చేసిన ఉద్యమం ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం 3 వేల రూపాయల జీతం ప్రకటించిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 10 వేల రూపాయలకు పెంచి ఇచ్చిందని తెలిపారు. ఆశాలకు నిర్దిష్టమైన పని విధానం రూపొందించకపోవడం విచారకరమన్నారు. నిర్దిష్టమైన పనిగంటలు, సెలవులు అమలు కాకపోవడం, ఉద్యోగ భద్రత, పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించకపోవడం వంటి అనేక సమస్యలు వేధిస్తున్నాయని చెప్పారు. ఉదయం, సాయంత్రం ఇంటింటికి తిరిగి సర్వేలు చేయమని, వెల్నెస్ సెంటర్లలో పనిచేయమని ఒత్తిళ్లు చేస్తున్నారని చెప్పారు. దీంతో ఆశా వర్కర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సేవలు అందించినప్పటికీ ఆశావర్కర్లు రిటైర్డ్ అయినా, మరణించినా ఎలాంటి సహాయం అందకపోవడం దారుణమన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి పెండ్యాల కల్పన ప్రసంగిస్తూ వేతనాలు లేకుండా 14 ఏళ్లపాటు పనిచేశారని, 14 ఏళ్ల ఉద్యమం తరువాత వేతనాలు సాధించామని చెప్పారు. ఉద్యోగ భద్రత కోసం మరోసారి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మే 20న జరిగే సమ్మెలో ఆశా వర్కర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల ఉద్యమానికి ఐద్వా అండగా నిలుస్తుందని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి చెప్పారు. కార్యక్రమంలో కాలం సుబ్బారావు, జీవీ కొండారెడ్డి, శేషయ్య, రమేష్, అరుణ, అనూష, సిఫోరా, విజయ, కోటేశ్వరి, నాగమ్మ, విశ్రాంతమ్మ, సుశీల, బాలమ్మ, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.