
ఉర్దూ విద్యకు ఉరి..?
మార్కాపురం: కూటమి ప్రభుత్వం నిర్ణయం ముస్లిం విద్యార్థులను ఉర్దూ విద్యకు దూరం చేస్తోంది. పాఠశాల పునర్నిర్మాణ ప్రక్రియ పేరుతో ముస్లిం విద్యార్థులకు ప్రభుత్వం ఉర్దూ విద్యను దూరం చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల పునప్రారంభం నాటికి జిల్లాలో ఉర్దూ టీచర్లు పలు చోట్ల కనుమరుగు కానున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉర్దూ డెవలప్‌మెంట్ సొసైటీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఓ నంబర్ 117ను రద్దుచేసి దాని స్థానంలో ఉన్నతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెబుతున్న కూటమి నాయకులు ఉర్దూను దూరం పెట్టడంపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మార్చి నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పాఠశాలలకు పోస్టులను మంజూరు చేస్తోంది. దీనితో ఉర్దూ యూపీ పాఠశాలల సెక్షన్ స్కూళ్లకు అన్యాయం జరుగుతోంది. జిల్లాలో 49 ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్స్, 16 అప్పర్ ప్రైమరీ ఉర్దూ మీడియం స్కూల్స్, 2 ఉన్నత స్థాయి ఉర్దూ మీడియం హైస్కూల్స్ ఉన్నాయి. వీటిలో 57 ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ సెక్షన్లు, 28 హైస్కూల్స్‌లో ఉర్దూ సెక్షన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 211 మంది ఉర్దూ టీచర్లు ఉన్నారు.
ఉర్దూ విద్య దూరం చేసేందుకే..
పాఠశాల వ్యవస్థ పునర్నిర్మాణంలో భాగంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, ముస్లిం విద్యార్థులకు ఉర్దూ విద్యను దూరం చేస్తున్నాయి. యూపీ పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 30కి పైగా విద్యార్థులు ఉండాలి. ఏ పాఠశాలల్లో నైనా ఇంతకంటే తక్కువ ఉంటే డి గ్రేడ్ చేస్తారు. దీంతో అనేక ఉర్దూ యూపీ పాఠశాలల్లో చదివే మైనార్టీ విద్యార్థులు ఉర్దూ చదువుకు దూరమవుతున్నారు. మార్కాపురం మండలంలో మార్కాపురం టౌన్, రాయవరం, బొడిచర్ల, తర్లుపాడు, తుమ్మలచెరువు, దేవరాజుగట్టు తదితర పాఠశాలల్లో ఉర్దూ చదివే విద్యార్థులు ఉన్నారు. వీరంతా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉర్దూ చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. జిల్లాలో మొత్తం 42 ఉర్దూ పోస్టులను సర్‌ప్లస్‌గా చూపారు. వీటి స్థానాల్లో వేరే టీచర్లను నియమించనున్నారు. దీంతో పలు స్కూళ్లలో ఉర్దూ పోస్టులు మాయమైపోతున్నాయి. గతంలో ఒక పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉంటే అందులో 15 మంది తెలుగు, 15 మంది ఉర్దూ చదివే విద్యార్థులు ఉంటే ఆయా సబ్జెక్టు టీచర్లను నియమించేవారు. నూతన నిబంధనల ప్రకారం ఉర్దూ టీచరు పోస్టును తొలగించనున్నారు. తర్లుపాడు మండలంలోని ఉర్దూ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను తొలగించి తెలుగు ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. రాష్ట్రంలో ఉర్దూ రెండవ అఽధికార భాషగా ఉన్నా ప్రభుత్వ నిర్ణయంతో ఉర్దూకు దూరమవుతున్నారు.
సర్‌ప్లస్ పేరుతో పోస్టుల తొలగింపు జిల్లాలో 42 ఉర్దూ టీచర్ పోస్టులకు మంగళం ఆందోళనలో ఉర్దూ విద్యార్థులు

ఉర్దూ విద్యకు ఉరి..?