ముగిసిన ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ప్రయాణం

May 14 2025 12:37 AM | Updated on May 14 2025 12:37 AM

ముగిస

ముగిసిన ప్రయాణం

కలిసి ఏడడుగులు నడిచారు. ధర్మేచ ఆర్థేచ కామేచ అంటూ పెళ్లి నాటి ప్రమాణాలను పాటించారు. కష్ట సుఖాలలో తోడు నీడగా మెలిగారు. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కన్నారు. అందుకోసం చేయి చేయి కలిపి ముందుకు కదిలారు. ఈ అన్యోన్య దంపతులను చూసి విధికి కన్నుకుట్టినట్టుంది. కడదాకా నడవక ముందే కర్కషంగా కాటేసింది. కడుపు చేతపట్టుకొని కూలి పనుల కోసం సుదూర ప్రాంతాలకు బయలు దేరిన వారిని మృత్యువు వెంటాడింది. కన్న బిడ్డలకు అమ్మా నాన్నలను లేకుండా చేసింది. ఇప్పుడు గడ్డమీదపల్లి గుండె పగిలింది. ఊరు వాడా ఏకమై గుక్కపట్టి రోదిస్తోంది. ఏ వీధి చూసినా అంతులేని విషాదంతో కన్నీరు పెడుతోంది.
మృత్యు దారిలో..

పాపం పసివాళ్లు

రామాంజి పల్నాడు జిల్లా వెల్దూర్తి మండలంలోని దావుపల్లి గ్రామానికి చెందిన వాడు. దాదాపు 11 ఏళ్ల క్రితం గడ్డమీదిపల్లెకు చెందిన అంకమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి యూకేజీ చదువుతున్న పవన్‌కుమార్‌, ఈ విద్యా సంవత్సరంలో ఎల్‌కేజీలో చేరేందుకు సిద్ధమవుతున్న నాగచైతన్య సంతానం. దాచేపల్లిలో చేసుకోవడానికి పనులు లేకపోవడంతో పాటు బొప్పాయి కోతలకు వెళ్తే కూలి ఎక్కువగా వస్తాయన్న ఆశతో ఆ కుటుంబం నెల రోజుల క్రితం గడ్డమీదిపల్లెకు చేరింది. అత్తవారింట్లో ఉంటూ రామాంజి తన భార్యతో కలిసి పనులకు వెళ్లేవాడు. పనికి వెళ్లిన తల్లిదండ్రుల కోసం ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రోడ్డు ప్రమాదం వారిని కబళించిందని, వారు ఇక రారు..ఇక వారి ఆలనా పాలనా ఉండదు అన్న విషయాన్ని ఆ చిన్నారులకు ఎలా చెప్పాలో తెలియక బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంకా ఊహ కూడా రాకముందే పిల్లలు అనాథలుగా మారారని, ఇక వారికి దిక్కెవరంటూ బంధువులు పెద్ద పెట్టున రోదించారు. వీరికి ఎవ్వరూ బంధువులు లేకపోవడంతో తాతయ్య వృద్ధుడు కావటంతో వీరి భవిష్యత్‌ ఏమవుతుందోనని తండావాసులు చర్చించుకుంటున్నారు.

సంఘటన స్థలంలో నుజ్జునుజ్జయిన వాహనాలు

యర్రగొండపాలెం:

ల్నాడు జిల్లా వినుకొండ మండలం ఈపూరు గ్రామంలో బొప్పాయి కాయలు కోసేందుకు మంగళవారం ఉదయం యర్రగొండపాలెం మండలంలోని గడ్డమీదిపల్లెకు చెందిన పగడాల రమణారెడ్డి దంపతులు, జొన్నగిరి రామాంజీ దంపతులు, మరికొందరు బొలేరో వాహనంలో బయలుదేరారు. గడ్డమీదిపల్లె గ్రామం నుంచి బయలుదేరిన గంటలోపే వినుకొండ మండలం శివాపురం సమీపంలోని జాతీయ రహదారిపై వీరు వెళుతున్న వాహనాన్ని ఎదురుగా కొబ్బరి బోండాలతో వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పగడాల రమణారెడ్డి(45), ఆయన భార్య సుబ్బమ్మ(40), జొన్నగిరి రామాంజీ (35), ఆయన భార్య అంకమ్మ(28) అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో వాహనం డ్రైవర్‌ కదిరి నాగేశ్వరరావు, కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాద విషయం తెలియగానే రెండు కుటుంబాలతో పాటు ఆ గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడే అందరినీ పలకరించి వెళ్లిన వారు తిరిగి తమ గ్రామంలోకి రారన్న చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఘటనా ప్రాంతానికి గ్రామం మొత్తం కదలి వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డవారు, క్షతగ్రాతులది ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ..

భవిష్యత్‌ ఎలా..

తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బొలెరో డ్రైవర్‌ కదిరి నాగేశ్వరరావు కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. తనకు తెలిసిన పని మోటార్‌ ఫీల్డ్‌ కావడంతో ఆయన బొలెరోను కొనుగోలు చేసుకొని జీవిస్తున్నాడు. తల్లికి కళ్లు కనపడవు, ఇద్దరు అక్కలు మూగవారు. వారి ఆలనాపాలన అంతా నాగేశ్వరరావు చూసుకునేవాడని, ప్రమాదంలో రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయని, ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో బాధితురాలు నాగమణిది మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామం. కొన్ని కారణాలతో ఇటీవల కాలంలో ఆమె గడ్డమీదిపల్లెకు చేరింది. అక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆ గ్రామానికి చెందిన మరో బాధితురాలు పగడాల శివమ్మ కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుందని ఆ గ్రామస్తులు తెలిపారు.

దావుపల్లి తండాలో విషాదఛాయలు

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లితండాకు చెందిన జొన్నగిరి రామాంజీ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారన్న విషయం తెలుసుకున్న తండావాసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వీరి మృతదేహాలను దావుపల్లితండాకు తీసుకొచ్చారు. మృతదేహాలు తండాలోకి రాగానే ఒక్కసారిగా రోదనలతో దద్దరిల్లింది. తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలియగానే పవన్‌కుమార్‌ రోదిస్తుండగా.. చైతన్య దిక్కులు చూస్తున్నాడు.

రోడ్డు ప్రమాదంలోనూ వీడని దాంపత్య బంధాలు బొలెరో వాహన్ని కొబ్బరి బొండాల లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం మరో ముగ్గురికి తీవ్రగాయాలు ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ.. తల్లిదండ్రుల కోసం చిన్నారుల ఎదురుచూపులు రోదిస్తున్న గడ్డమీదిపల్లె...మిన్నంటిన విషాదం

పిల్లల భవిష్యత్‌ కోసమని..

గడ్డమీదిపల్లెకు చెందిన పగడాల రమణారెడ్డి, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్దకుమార్తెకు వివాహం చేశారు. మిగిలిన ఇద్దరిలో కుమారుడు వెంకటరెడ్డి మార్కాపురంలోని ఒక కళాశాలలో బీఫాం చదువుతున్నాడు. కుమార్తె నవిత ఇంటర్‌ పూర్తిచేసుకొని ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతోంది. తాము కూలీ పనులు చేసుకుంటున్నా తమ పిల్లలు మంచి చదువులు చదవాలన్న ఉద్దేశంతో వారిని పనులకు దూరంగా ఉంచి వారు కాయకష్టం చేసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుమార్తెలు, కుమారుడు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ, కష్టపడుతూ తమకు కష్టం తెలియకుండా చూసుకునే తమ తల్లిదండ్రులు ఇలా విగతజీవులుగా మారతారని తాము కలలో సైతం ఊహించలేదంటూ వారు పెట్టే రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి.

మరణంలోనూ వీడని తోడు..

దాంపత్య బంధాలు జీవిత కాలం ఉంటాయనడానికి గడ్డమీదిపల్లె వాసులు నిరూపించారు. కలిసి జీవించడం, కలిసి మరణించడంలో కూడా వారు ముందున్నారు. రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారారు పగడాల రమణారెడ్డి, సుబ్బమ్మ, జొన్నగిరి రామాంజి, అంకమ్మ దంపతులు. పనికి పోయి వస్తామంటూ కన్నబిడ్డలకు, కుటుంబ సభ్యులకు, ఇంటి పక్కన వాళ్లకు చెప్పి బయలుదేరిన గంట వ్యవధిలో మృత్యువాత పడటం ఆ ఊరిని కుదిపేసింది.

ముగిసిన ప్రయాణం1
1/7

ముగిసిన ప్రయాణం

ముగిసిన ప్రయాణం2
2/7

ముగిసిన ప్రయాణం

ముగిసిన ప్రయాణం3
3/7

ముగిసిన ప్రయాణం

ముగిసిన ప్రయాణం4
4/7

ముగిసిన ప్రయాణం

ముగిసిన ప్రయాణం5
5/7

ముగిసిన ప్రయాణం

ముగిసిన ప్రయాణం6
6/7

ముగిసిన ప్రయాణం

ముగిసిన ప్రయాణం7
7/7

ముగిసిన ప్రయాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement