
కూలీల వలసలు నివారించాలి
● వినుకొండ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు కూలి పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఈ ప్రయాణంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు వదలుతున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని గడ్డమీదిపల్లె గ్రామానికి చెందిన కూలీలు బొప్పాయి కోతల కోసం వెళ్తు పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామానికి సమీపంలోని హైవే రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నలుగురు కూలీలు మరణించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే మంగళవారం ఆయన గడ్డమీదిపల్లెకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతులకు పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని, ఈ కారణాలతో వందల ఎకరాలు ఉన్న రైతులు సైతం కూలి పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు కూడా సక్రమంగా జరగడం లేదని, ఆ నిధులను కూడా కూటమి నాయకులు మెక్కేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పనులు కల్పించకపోవడంతోనే గడ్డమీదిపల్లెకు చెందిన 300 కుటుంబాలు వలసలు వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థవుతుందన్నారు. మృతుల కుటుంబాలను పరిశీలిస్తే కూలీ పనుల కోసం దూర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయం అర్థం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం యర్రగొండపాలెం మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే వలసలు వెళ్లక తప్పడం లేదన్నారు. వలసలు నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్ట్‌కు నీళ్లు వదలడమే సరైన మార్గమన్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు భారీ ఎత్తున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.