
గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి
రాచర్ల: మండల కేంద్రమైన రాచర్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గంజికుంట్ల మౌళిమనోహర్(40) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబయిలోని ఆర్మీ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఉదయం 10:30 గంటలకు తమ క్యాంప్‌లోనే గుండెపోటుకు గురయ్యారు. తోటి జవాన్లు హుటాహుటిన ఆర్మీ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆర్మీ ఉన్నధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మౌళిమనోహర్ మృతి విషయం తెలియడంతో భార్య వెంకట నవ్యతోపాటు కుమారుడు, కుమార్తె, బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. జవాన్ భౌతికకాయాన్ని బుధవారం సాయంత్రం రాచర్ల గ్రామానికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎల్లమ్మ గుడిలో
హుండీ చోరీ
హనుమంతునిపాడు: మండల కేంద్రమైన హనుమంతునిపాడులోని నాగరప్ప ఎల్లమ్మ గుడిలో హుండీని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి కానుకలు అపహరించారు. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. అందిన సమాచారం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లి గ్రామ సమీపంలోని ఊరకుంట వద్ద పగలగొట్టారు. అందులో ఉన్న రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారు వస్తువులు చోరీ చేశారు. గుడి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సర్‌ప్లస్ ఉర్దూ పోస్టులపై డీఈఓ స్పందించాలి
మార్కాపురం టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉర్దూ పోస్టులను సర్‌ప్లస్‌లో చూపిన జిల్లా విద్యాశాఖ అధికారులు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఉర్దూ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు పి.అబ్దుల్ వహీద్ ఖాన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సర్‌ప్లస్‌లో 40 ఎస్‌జీటీ, 9 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జీవో ప్రకారం సర్‌ప్లస్‌లో ఎలా చూపారో తెలపాలన్నారు. యుడైస్‌లో ఉర్దూ మీడియం ఉన్నా ఇంగ్లిష్ మీడియం పెట్టమనడం, ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూళ్లలో ఉర్దూ ఎస్‌జీటీకి బదులు తెలుగు ఎస్‌జీటీని ఉంచడంపై ప్రశ్నించారు. ఉర్దూ ఒక భాషగా ఉన్న స్కూళ్లలో ఎస్‌ఏ ఉర్దూ, ఎస్‌జీటీ ఉర్దూలను ఏ జీఓ ప్రకారం తీశారని నిలదీశారు. ఉపాధ్యాయులను సర్‌ప్లస్‌గా చూపిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఉర్దూ విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారో సీఎస్‌సీ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి