
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
ఒంగోలు టౌన్/
మద్దిపాడు : వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందున్న లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. ఈ సంఘటన మద్దిపాడు మండలంలోని ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహాబలిపురం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న తేజస్విని ట్రావెల్ బస్సు గ్రోత్ సెంటర్ వద్దకు రాగానే ముందున్న లారీని దాటవేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో లారీని బస్సు ఢీకొనడంతో రెండు వాహనాలు కొంత మేర దెబ్బతిన్నాయి. బస్సులోని ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదం ధాటికి బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్క ఉదుటన లేచి భయాందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మద్దిపాడు ఎస్సై శివరామయ్య తెలిపారు.
తప్పిన పెను ప్రమాదం ఐదుగురికి స్వల్ప గాయాలు
ఓవర్ టేక్ చేసే క్రమంలో ఘటన