
మార్కాపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చింతగుంట్ల, తిప్పాయిపాలెం గ్రామాల మధ్య చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై అంకమరావు కథనం మేరకు.. తిప్పాయిపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు(45) తన బైక్‌పై మార్కాపురం బయలుదేరాడు. గ్రామ శివారు దాటగానే తాడివారిపల్లి నుంచి మార్కాపురం మీదుగా కంభం వైపు బైక్‌పై వెళ్తున్న మహేష్ ఎదురుగా వస్తున్న వెంకటేశ్వర్లును ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం జీజీహెచ్‌కు తరలించగా వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య భారతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జీవనోపాధి కోసం ఉదయాన్నే భార్యపిల్లలకు చెప్పి బయలుదేరిన వెంకటేశ్వర్లు ఊరు దాటగానే మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.