
సరైన సాక్ష్యాలతోనే నిందితులకు శిక్ష
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: ఎట్టి పరిస్థితితుల్లోనూ నిందితులకు శిక్ష పడాల్సిందేనని, అప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని, సరైన సాక్ష్యాల సేకరణతోనే నిందితులకు శిక్షలు పడతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్‌పై ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. వర్క్‌షాప్‌ను ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ నేరస్తుడు వదిలి పెట్టిన భౌతిక సాక్ష్యాధారాలను సశాసీ్త్రయంగా సేకరించినప్పుడే నేరాన్ని రుజువు చేసి శిక్షలు పడేలా చేయడం సాధ్యమవుతుందన్నారు. సాక్ష్యాలను సేకరించే విషయంలో పోలీసు అధికారులు నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. రోజూ పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల్లో పోలీసు అధికారులకు సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని చెప్పారు. నేరం జరిగిన తీరుతెన్నుల ఆధారంగా కొన్ని కేసులు సులువుగా ఛేదించగలిగితే మరికొన్ని కేసులను ఛేదించడం క్లిష్టతరంగా ఉంటాయని వివరించారు. నేరానికి దారి తీసిన పరిస్థితులను సమగ్రంగా తెలుసుకునే విషయంలో నిష్ణాతులు కావాలని చెప్పారు. సకాలంలో సాక్ష్యాలను సేకరించడం, వాటిని తగిన జాగ్రతల్లో ప్యాకింగ్ చేయడం, వీలైనంత త్వరగా వాటిని ఫోరన్సిక్ ల్యాబరేటరీకీ పంపించడం చాలా అవసరమన్నారు. సాక్ష్యాల సేకరణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీసు అధికారులంతా నైపుణ్యం కలిగి ఉండాలని, శిక్షణలో నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. శిక్షణ తరగతుల్లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్ పాల్గొన్నారు.