
గోకులం బిల్లు మని!
పొన్నలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తరువాత పాడిరైతుల అభివృద్ధికి మినీ గోకులం షెడ్లు నిర్మిస్తామని ముందుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ పెంచి పశుపోషకుల జీవన శైలి మెరుగుపర్చాలన్నదే గోకులం షెడ్ల ప్రధాన లక్ష్యం. అయితే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించే గోకులం షెడ్లకు.. పశువుల షెడ్లకు 90 శాతం రాయితీ, గొర్రెలు, మేకలు, కోళ్లకు 70 శాతం రాయితీని చెల్లిస్తారు. ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా అందించే రూ.2.30 లక్షల్లో రూ.23 వేలు లబ్ధిదారుని వాటా ఉండగా మిగిలిన రూ.2.07 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. ఇంత వరకు బాగానే ఉన్నా గ్రామాల్లో రైతులు నిర్మించిన గోకులం షెడ్లకు ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడంతో ఐదు నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 1190 గోకులం షెడ్లు మంజూరు కాగా ఇందులో 799 షెడ్లను పూర్తి స్థాయిలో నిర్మించారు. మిగిలిన 391 వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో నిర్మించిన 799 షెడ్లకు సుమారుగా రూ.16.54 కోట్ల నిధులు మంజూరు చేయాలి. అలాగే కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 268 గోకులం షెడ్లు మంజూరు కాగా ఇందులో 172 షెడ్లను పూర్తిగా నిర్మించగా మిగిలిన 96 వివిధ దశలో ఉన్నాయి. కొన్ని అసలు మొదలు పెట్టలేదు. అయితే పూర్తి స్థాయిలో నిర్మించిన 172 షెడ్లకు సుమారుగా రూ.3.54 కోట్ల నిధులు లబ్ధిదారులకు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
రైతులపై చిన్నచూపు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పది నెలలుగా రాష్ట్రంలోని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు, మద్దతు ధరలేకపోవడం, ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం శూన్యం. ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం చూపిస్తున్న ద్వంద్వ వైఖరితో రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. అలాగే గ్రామాల్లో పశుపోషకులు గోకులం షెడ్ల పనులు ప్రారంభించిన తరువాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో మధ్యలో నిర్మాణ పనులను వదిలేయలేక రైతులు అప్పులు చేసి షెడ్లును పూర్తి స్థాయిలో నిర్మించారు. మరికొందరు రైతులు గోకులం షెడ్ల నిర్మాణ పనులు అసలు ప్రారంభించలేదు. మొత్తంగా ఐదు నెలలుగా నిధులు మంజూరు చేయకపోవడం వలన గోకులం షెడ్లు లబ్ధిదారులు ఆర్థికంగా అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు.
షెడ్లు నిర్మించినా నిధులు రాక రైతుల నిరాశ ఐదు నెలలుగా నిధుల కోసం నిరీక్షణ జిల్లాలో 1190 మంది రైతులకు గోకులం షెడ్లు మంజూరు అప్పులు తెచ్చి 799 షెడ్లు నిర్మించిన రైతులు జిల్లాలో లబ్ధిదారులకు రావాల్సిన నిధులు రూ.16.54 కోట్లు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
త్వరలోనే నిధులు మంజూరవుతాయి
జిల్లాలో గోకులం షెడ్లు నిర్మించిన పశుపోషకులకు ఇంకా బిల్లులు మంజూరు కాలేదు. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారుగా 799 మంది లబ్ధిదారులు పూర్తి స్థాయిలో గోకులం షెడ్లు నిర్మించారు. ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి అందించాం. నిధులు మంజూరు కాకపోవడంతో వెంటనే బిల్లులు చెల్లించలేకపోయాం. వచ్చే పది రోజుల్లో సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు బిల్లులు అందిస్తాం.
– జోసఫ్ కుమార్, డ్వామా పీడీ, ఒంగోలు