
అంకమ్మ తల్లి కొలుపులకు రాజకీయ గ్రహణం
నాగులుప్పలపాడు: వరాలు అందించే అంకమ్మ తల్లి కొలుపులకు ఈ సారి రాజకీయ గ్రహణం పట్టింది. అనాదిగా అమ్మవారి ఆస్తులపై పెత్తనం చేసిన ఊరి పెద్ద వారసుడు అమ్మవారి సొమ్ములను, ఆస్తులను అన్యాక్రాంతం చేయడంతో ఈ సారి సొంతంగానే కొలుపులు నిర్వహించుకుందామనుకున్న ఆలయ కమిటీ ఆలోచనలకు ఓర్వలేని పెత్తందారులు అమ్మవారి కొలుపులు నిర్వహించే కుటుంబ సభ్యులలోనే విభేదాలు సృష్టించి దానికి రాజకీయ రంగు పులిమి చివరకు కొలుపులు ఆగేలా చేసి గ్రామంలో అలజడికి కారణమయ్యారు. వివరాల్లోకి వెళ్తే నాగులుప్పలపాడు గ్రామంలో 6 దశాబ్దాలకు పైగా వడ్డెర రాజుల కులస్తులు తమ కులదైవం అంకమ్మ తల్లికి ప్రతి మూడేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా కొలుపులు నిర్వహిస్తారు. వడ్డెరలు అమ్మవారికి తయారు చేయించిన బంగారు వస్తువులు, నగదును గ్రామంలోనే పేరు మోసిన ఓ పెత్తందారి ఆధీనంలో ఉంచుతూ కొలుపులు నిర్వహించుకుంటున్నారు. ఆ పెద్ద మనిషి కూడా కొలుపులు నిర్వహించుకునే వారికి అండదండగా ఉంటూ వచ్చాడు. అయితే ఆయన తరువాత అమ్మవారి వస్తువులు, నగదు బాధ్యత చేపట్టిన పెత్తందారి కుమారుడు తన వక్రబుద్ధితో రెండేళ్ల క్రితం అమ్మవారి బంగారు ఆభరణాలు దొంగతనం చేశాడన్న అభియోగంతో పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వడ్డెర కులస్తులకు అమ్మవారి బంగారు ఆభరణాల వివరాలు చెప్పని పెత్తందారి కుమారుడు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే అంకమ్మ తల్లి ఆలయంలో పెత్తందారుల పెత్తనం వద్దని, అమ్మవారిని తమ కుల ధైవంగా భావించే గుంజి అనే ఇంటి పేరు గల కుటుంబ సభ్యులు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసుకొని దానిని రిజిస్టర్ చేయించి ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అమ్మవారికి అత్యంత వైభవంగా కొలుపులు నిర్వహించాలని నిర్ణయించిన గుంజి వారసులు కొలుపులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలోని పెత్తందారుల ప్రమేయం లేకుండా చేసుకుంటున్న ఈ కొలుపులకు ఓర్వలేని కొంత మంది పెద్ద మనుషులు అధికార పార్టీ అండదండలతో గుంజి వారి కుటుంబంలోనే కొద్ది మందిని రెచ్చగొట్టి కొలుపులు జరపకుండా చేయాలని కుట్ర పన్నారు. అనుకున్నదే తడవుగా అధికార పార్టీ నాయకుల చేత కొలుపులు నిర్వహించే వారిపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో పాటు వారికి ప్రతిపక్ష పార్టీ వారంటూ పేరు అంటగట్టి పూర్తి స్థాయి అధికార ధర్పాన్ని ప్రదర్శించి వారిపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో ఆలయ కమిటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలకు సమ్మతించిన హైకోర్టు ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేది వరకు కొలుపులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులు అందజేయడానికి వెళ్లిన కమిటీ సభ్యులపై అందరూ కలిసి కొలుపులు నిర్వహించుకోవాలని జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. గతంలో అమ్మవారి సొమ్ములు అన్యాక్రాంతం చేసిన వారిని కమిటీలోకి తీసుకోకుండా కొలుపులు చేసుకోవడానికి అంగీకరిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో అనుకున్నట్లే శనివారం ఉదయం కోర్టు అనుమతి కాగితాలు పోలీసులకు అందజేసి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న కమిటీ సభ్యులపై అప్పటికే అక్కడ వేచిఉన్న మరొక వర్గం వారు ఆలయంలోకి రాకుండా అడ్డుకోవడంతో ఇరు వర్గాల వారు ఘర్షణ ఏర్పడి ఇరు పక్షాల వారికి గాయాలయ్యాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో పోలీసులు తమ పట్ల నిరంకుశంగా వ్యవహరించారంటూ ఆలయ కమిటీ లోని నలుగురు సభ్యులు పురుగుల మందు తాగడంతో వారిని అత్యవసరంగా 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఈ క్రమంలో రోడ్డు పై భైఠాయించి రాస్తారోకో చేసిన ఆలయ కమిటీ వారిని కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆలయం వద్ద పూర్తి స్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గతంలో పెత్తనం చేసిన వారు అమ్మవారి సొమ్ము స్వాహా దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు వర్గపోరును రెచ్చగొట్టిన పెత్తందారులు కోర్టు ఆదేశాలను ఖాతరు చేయని పోలీసులు కమిటీ సభ్యులను ఆలయంలోకి రాకుండా పోలీసులతో అడ్డుకున్న అధికార పార్టీ వర్గీయులు దాన్ని నిరసిస్తూ పురుగుల మందు తాగిన నలుగురు కమిటీ సభ్యులు పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా రాస్తారోకో

అంకమ్మ తల్లి కొలుపులకు రాజకీయ గ్రహణం

అంకమ్మ తల్లి కొలుపులకు రాజకీయ గ్రహణం

అంకమ్మ తల్లి కొలుపులకు రాజకీయ గ్రహణం