
నీటితొట్లలో నాణ్యత డొల్ల
కొనకనమిట్ల: వేసవిలో మూగ జీవాలు పొలాలకు మేత కోసం వెళ్లినప్పుడు గుక్కెడు నీరు దొరకటం గగనంగా ఉంటుంది. మూగ జీవాలను తోలుకెళ్లే కాపరులు వాటికి నీటిని అందించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల పశువులకు ఉపయోగపడేలా నీటి తొట్లు ఏర్పాటుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించింది. ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.30 వేలు మంజూరు చేసింది. అయితే నీటి తొట్ల నిర్మాణాన్ని కూటమి నేతలకు అప్పగించింది. వారికి తొట్ల నిర్మాణం వరంగా మారింది. తూతూ మంత్రంగా నిర్మించి నిధులు బొక్కేస్తున్నారు. అయితే నాసిరకం ఇసుక, కంకర, ఇటుక వాడుతుండటంతో తొట్లు తొందరగా లీకయ్యే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కొనకనమిట్ల మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో 13 గ్రామాల్లో 48 నీటి తొట్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. గొట్లగట్టులో 10, సిద్దవరం 6, ఇరసలగుండం 4, వింజవర్తిపాడు 3, రేగుమానిపల్లి 3, గరిమినపెంట 3, కాట్రగుంట 2, తువ్వపాడు 2తో పాటు పలు గ్రామాల్లో నీటి తొట్లు అవసరమని భావించి నిధులు కేటాయించారు. అయితే 48 నీటి తొట్లు నిర్మాణం చేపట్టేందుకు మండలంలోని ఓ కూటమి నేతకు నియోజకవర్గ నేత కాంట్రాక్ట్ అప్పజెప్పినట్లు సమాచారం. ఇప్పటికే కాంట్రాక్ట్ దక్కించుకున్న నేత నాసిరకం మెటీరియల్ వాడి చకచకా 40 తొట్లు పూర్తి చేశాడు. ఇంకా 8 తొట్లు పూర్తి కాలేదు. పూర్తి చేసనవి కూడా సక్రమంగా క్యూరింగ్ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తొట్లు మంజూరైన గ్రామాల్లో స్థానిక కూటమి నేతలు ఉండగా వారిని కాదని ఒక్క నాయకుడికే 48 తొట్లు నిర్మాణం చేపట్టేలా కాంట్రాక్ట్ ఇవ్వటంతో స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో తొట్ల నిర్మాణాన్ని అధికార పార్టీ నేతలే అడ్డుకుంటున్నట్లు సమాచారం. అదికూడా నాసిరకంగా తొట్లు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. అధికార పార్టీలోనే తొట్ల నిర్మాణంపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వేసవి కాలం సగం పూర్తవుతోంది. అన్నీ పూర్తి చేసి నీటి వసతి కల్పించే సరికి పుణ్య కాలం కాస్త అయిపోతుందని పశుపోషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవుడు దయ వలన ఇటీవల అక్కడక్కడా వర్షాలు పడి కుంటల్లో కాస్తో కూస్తో నీరు ఉండటంతో మూగ జీవాలకు కొంత వరకు ఉపయోగంగా ఉండటంతో కాపరులు ఊపిరి పోసుకున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తొట్ల నిర్మాణం సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకుని నీటి వసతి కల్పిస్తే రాబోవు రోజుల్లోనైనా పశువులకు ఉపయోగంగా ఉంటుంది.
నాసిరకం కంకర, వాడుకకు పనికిరాని ఇటుకలతో తొట్లు తొట్ల నిర్మాణం పశువుల కోసమా..బిల్లుల కోసమా అధికార పార్టీలోనే అసంతృప్తులు

నీటితొట్లలో నాణ్యత డొల్ల

నీటితొట్లలో నాణ్యత డొల్ల

నీటితొట్లలో నాణ్యత డొల్ల