
సంక్షోభంలో వ్యవసాయ రంగం
ఒంగోలు టౌన్: వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోవడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఈ ఏడాది అన్నీ రకాల పంటల ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పులపాలయ్యారని సంయుక్త కిసాన్ రైతు మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు చెప్పారు. దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20వ తేదీ చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నారాయణ స్వామి భవనంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి మాట్లాడుతూ ధాన్యాన్ని రూ.400 తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని, గతేడాది రూ.18 వేలకు విక్రయించిన మిర్చిని ఈ ఏడాది రూ.9 వేలకు అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. పత్తిని 2 వేలకు తక్కువగా అమ్ముతుండగా బర్లీ పొగాకును కొనేనాధుడే లేడన్నారు. అపరాలు, రొయ్యలు, జీడి పిక్కలు, కోకో గింజల ధరలు కంపెనీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరల విషయంలో కలుగజేసుకోకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా రైతులను దగా చేసిందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంతిబాబు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇస్తానన్న రూ.20 వేలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, సుధీర్, ఆర్.మోహన్, కె.నాంచార్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని రైతుసంఘాల పిలుపు