
కుట్టు స్కీమ్ కాదు.. రూ.కోట్లు కొల్లగొట్టే స్కామ్
ఒంగోలు సిటీ:
మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వ నాయకులు భారీ మోసానికి తెగబడ్డారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ విమర్శించారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహిళా విభాగం నాయకులతో కలిసి ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుంపా రమణమ్మ మాట్లాడుతూ.. కుట్టు మిషన్‌కు కొనుగోలుకు రూ.4300, ఒక వ్యక్తి శిక్షణ నిమిత్తం రూ.3 వేలు వెరసి మొత్తం రూ.7300 ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ.23 వేల చొప్పున కేటాయించడం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు. వాస్తవంగా లబ్ధిదారులకు అయ్యే ఖర్చు రూ.73 కోట్లు అయితే, కూటమి నాయకులకు రూ.167 కోట్లు దోచిపెట్టేందుకు పథక రచన చేశారని విమర్శించారు. శిక్షణ మొదలైననప్పటి నుంచి 50 రోజుల్లోపే రూ.167 కోట్లు పంచుకు తినేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ఒక్కో మహిళా లబ్ధిదారుపై వెచ్చిస్తున్న సొమ్ములో రూ.16,700 కూటమి నేతల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే నగదు చెల్లించేవారని, కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితే లేదన్నారు. చంద్రబాబునాయుడు అధికార యావతో అడ్డగోలు హామీలిచ్చారని, గద్దెనెక్కిన తర్వాత ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసింది లేదని నిప్పులు చెరిగారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1800, 50 ఏళ్లు నిండిన బీసీ మహిళలకు పింఛన్లు, మహిళలకు ఫ్రీ బస్సు, ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇలా ఇష్టారీతిగా హామీలిచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఆరాచకాలను, మోసాలను ప్రజలు గమనించాలని కోరారు.
హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిరా మాట్లాడుతూ.. బీసీ మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో రూ.167 కోట్లు దోపిడీ చేస్తున్న కూటమి పాలకులు, త్వరలోనే కమ్మ, కాపు, ఈబీసీ కార్పొరేషన్ల పేరుతో మరో రూ.81 కోట్లు నొక్కేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ మాట్లాడుతూ.. కుట్టుమిషన్ల పేరుతో జరిగిన అవినీతికి సహకరించిన అధికారుల ఉద్యోగాలు ఊడటం ఖాయమని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్న మాట్లాడుతూ.. కుట్టుమిషన్లను పేద మహిళలకు కేటాయించకుండా మోసగించడం దారుణమన్నారు. వలంటీర్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి గోనెల మేరికుమారి మాట్లాడుతూ.. కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో మహిళా నాయకులు గోనుగుంట రజని, ముప్పరాజు జ్యోతి, జిల్లా అఽంగన్‌వాడీ వింగ్ అధ్యక్షురాలు కనపర్తి గోవిందమ్మ, మద్దిపాడు మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మన్నెం సంధ్య, ఎస్.లక్ష్మీకాంతమ్మ, తొగురు మాధవి, పులిగోటి రాజేశ్వరి, కొమ్మతోటి సంధ్య, దుంపా నాగలక్ష్మి, కుందురు లక్ష్మి, సన్నపురెడ్డి రమణమ్మ, కాకర్లమూడి రజిని తదితరులు పాల్గొన్నారు.
కుట్టుమిషన్లు, శిక్షణ పేరుతో కూటమి భారీ మోసం
మహిళలను నిలువునా మోసగిస్తున్నారు
అధికార యావతోనే చంద్రబాబు అడ్డగోలు హామీలు
గద్దెనెక్కిన తర్వాత ఒక్కటీ అమలు చేసేది లేదు
కూటమి నాయకుల దారుణాలను
ప్రజలు గమనిస్తున్నారు
విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు