
మార్కాపురంలో కేంద్ర బృందం పర్యటన
మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. 2022 నుంచి 2024 వరకు ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర బృంద సభ్యులైన రాజు, విజయేందర్ పరిశీలించారు. మార్కాపురం మండలంలోని కొట్టాలపల్లి ఎస్సీ కాలనీలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, జమ్మనపల్లి ఎస్సీ కాలనీలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలు, తర్లుపాడులో రోడ్డు, కొనకనమిట్ల మండలంలోని సలనూతల గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను తనిఖీ చేశారు. వీరి వెంట మార్కాపురం పంచాయతీరాజ్ డీఈ రవి ప్రకాష్, ఏఈ విజయ్‌మోహన్‌రాజా, తర్లుపాడు ఏఈ శ్రీనివాసరెడ్డి, కొనకనమిట్ల ఏఈ మహంకాలయ్య ఉన్నారు.
పిడుగుపాటుకు
చింత చెట్టు దగ్ధం
మార్కాపురం: పిడుగుపాటుకు చింత చెట్టు నిలువునా దగ్ధమైంది. ఈ సంఘటన మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న చింత చెట్టుపై పిడుగు పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో గ్రామస్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
క్రీడాస్ఫూర్తి అవసరం
ఒంగోలు టౌన్: చిన్నారులు ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, పోటీతత్వాన్ని, క్రీడాస్పూర్తిని అలవర్చుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్–2025ను ప్రారంభించారు. పిల్లలతో కాసేపు టగ్ ఆఫ్ వార్ ఆడి ప్రోత్సహించారు. క్యాంపులో భాగంగా మొదట ఫుట్‌బాల్ శిక్షణను ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. వేసవి క్రీడా శిక్షణ శిబిరం జూన్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఇస్తారని, పోలీసుల పిల్లలతో పాటు ఇతర చిన్నారులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఆర్‌ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.
అనంత సాగర ప్రయాణం పుస్తకావిష్కరణ
ఒంగోలు సబర్బన్: అభాగ్యుల జీవితాల్లో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవీ సాగర్ కొత్త వెలుగులు నింపారని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్వీఎస్ రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాజీవ్‌నగర్‌లోని హెల్ప్ కార్యాలయంలో ‘అనంతసాగర ప్రయాణం నా జీవన ప్రస్థానం’ పుస్తకాన్ని రామ్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్ప్ సంస్థలో సామాన్య కార్యకర్తగా జీవనాన్ని ప్రారంభించిన సాగర్.. రెండు దశాబ్దాలుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో పనిచేశారన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మికుల నివారణ, మానవ అక్రమ రవాణా నిర్మూలన, బాలలపై లైంగిక వేధింపుల నిర్మూలన, దివ్యాంగులు, మానసిక దివ్యాంగుల, నిరుపేదలు, నిరాధరణకు గురైన వృద్ధులను చేరదీయడం.. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ క్రమంలోనే జాతీయ పురస్కరాలు, మరెన్నో ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. సాగర్ దంపతులను హెల్ప్ సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.

మార్కాపురంలో కేంద్ర బృందం పర్యటన

మార్కాపురంలో కేంద్ర బృందం పర్యటన

మార్కాపురంలో కేంద్ర బృందం పర్యటన