
జాతిపిత విగ్రహం తొలగింపులో వివాదం
కొండపి: మండలంలోని నేతివారిపాలెం గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం తొలగింపు వివాదానికి దారితీసింది. గ్రామంలో 60 ఏళ్ల క్రితం గాంధీ విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విగ్రహం శిథిలమైందని భావించిన ఓ వర్గం పాతదానికి పది అడుగుల దూరంలో శనివారం నూతన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే పాత విగ్రహం ఉన్నచోటనే కొత్తది ఉంచాలని లేదంటే ఇటీవల మరమ్మతులు చేయించిన పాత విగ్రహాన్నే కొనసాగించాలని మరో వర్గం వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో జేసీబీతో పాత విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరో వర్గం వారు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. కాగా పాత గాంధీ విగ్రహాన్ని తొలగించి టీడీపీ నాయకుల విగ్రహాలు పెట్టాలని చూస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ వివరణ కోరగా నూతన విగ్రహాన్ని పెట్టడానికి లేదా పాత విగ్రహాన్ని తీసివేయడానికి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, ఆ స్థలం ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. నూతన బొమ్మతోపాటు పాత బొమ్మకు కూడా అనుమతి లేదని ఆర్‌అండ్‌బీ అధికారి మాధవరావు చెప్పారు.
కొండపి మండలం నేతివారిపాలెంలో ఘటన
పాత విగ్రహానికి 10 అడుగుల దూరంలో కొత్త విగ్రహం పెట్టిన ఓ వర్గం
పాత విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి తొలగించేందుకు మరో వర్గం ప్రయత్నం
పోలీసుల రాకతో సద్దుమణిగిన ఉద్రిక్తత

జాతిపిత విగ్రహం తొలగింపులో వివాదం