
కొత్తపాలెంలో నీటి సమస్య పరిష్కారం
పొన్నలూరు: పొన్నలూరు మండలం రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో సుమారు 25 ఏళ్ల క్రితం రూ.1.60 కోట్లతో సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ స్కీమ్ పంచాయతీలతో సంబంధం లేకుండా పనిచేసేందుకు ప్రత్యేకంగా టెండర్ ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ ప్రక్రియను నిలిపేసి సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీళ్లు వదిలే పనిని స్థానిక తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలై గత నాలుగు రోజుల నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా గ్రామస్తులకు నీటి సరఫరా ఆగింది. దీంతో గ్రామస్తులు తాగు, వాడుక నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ‘ఆధిపత్య పోరు.. నిలిచిన నీరు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు. ఓ వ్యక్తిని నియమించి సోమవారం నీటిని సరఫరా చేశారు. గత నాలుగు రోజులుగా ఉన్న నీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
కనిగిరి రూరల్: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం కనిగిరిలో చోటుచేసుకుంది. వివరాలు.. కనిగిరి పదో వార్డులోని హనీఫ్ నగర్‌కు చెందిన సయ్యద్ అలీ(15) అతని స్నేహితుడు కలిసి బైక్‌పై మాచవరం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో చాకిరాల రోడ్డు వైపు నుంచి ఆర్.సాయి(విద్యార్థి) బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తూరు సమీపంలోని మలుపు వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైక్‌పై వెనుక వైపు కూర్చుని ఉన్న సయ్యద్ అలీ తలకు బలమైన గాయాలు కావడంతో ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత ఒంగోలుకు, అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ అలీ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
అందరివాడు అలీ..
చిన్న తనంలోనే అలీ తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో పెరుగుతున్నాడు. హనీఫ్ నగర్‌లో ప్రతి ఒక్కరికీ తలలో నాలుకలా మారాడు. ప్రమాదానికి ముందు వరకు తమతో ఆడుకున్న అలీ.. అనుకోని రీతిలో మృత్యు ఒడికి చేరడంతో స్నేహితులంతా రోధించారు. తాతయ్య కరీముల్లా, అమ్మమ్మ, పిన్ని రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.