స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
సోమవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సీల్స్ వేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య నియోజకవర్గాల వారీగా జిల్లాలో ఏర్పాటు చేసిన 5 ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను సంబంధిత పోలింగ్ కేంద్రాల పీవోలు, ఏపీవోలు జమ చేశారు. అక్కడి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఆయా ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల నుంచి జిల్లా మొత్తానికి ఏర్పాటు చేసిన రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గంలోని ఈవీఎంలు మార్కాపురంలోని ఎస్‌వీకేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూములకు, అదేవిధంగా దర్శి నియోజకవర్గంలోని ఈవీఎంలు దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముకు, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల ఈవీఎంలు రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూములకు, గిద్దలూరు నియోజకవర్గంలోని ఈవీఎంలను సెయింట్ పాల్స్ కాలేజిలోని ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముకు, కనిగిరి నియోజకవర్గంలోని ఈవీఎంలను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలోని ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఆయా ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల నుంచి జిల్లాలోని మొత్తం నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, రూట్ అధికారులు పోలీసు బందోబస్తుతో రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూముకు తరలించి కౌంటింగ్ వరకు అక్కడే కట్టుదిట్టంగా భద్రపరుస్తారు.


