కమీషన్ల పాపం మీదే..! | Sakshi
Sakshi News home page

కమీషన్ల పాపం మీదే..!

Published Thu, Nov 9 2023 1:12 AM

మీడియాతో మాట్లాడుతున్న బాలినేని - Sakshi

ఒంగోలు: కొత్తపట్నం వెళ్లే మార్గంలో బకింగ్‌ హాం కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణంలో కమీషన్లు తీసుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దామచర్ల ఆయన సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్‌ను పెట్టి కమీషన్లు దండుకుని నాపై నిందలు వేయడం ఏమిటంటూ మండిపడ్డారు. 80 శాతం పనులు చేశానని ఒక వైపు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. రెండు సంవత్సరాలపాటు పనులు చేయకుండా ఉంటే పలు మార్లు మాట్లాడితే చివరకు కాంట్రాక్టర్‌ వచ్చారని, ఆయనతో మాట్లాడితే కేంద్రం నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రూ.40 లక్షల మెటీరియల్‌ ఇస్తే పనులు చేస్తానని చెప్పడంతో తాను తన సొంతంగా రూ.40 లక్షల మెటీరియల్‌ ఇప్పించానన్నారు. నిర్ణీత సమయం గడిచిపోయిందంటూ కేంద్రం నిధుల మంజూరు నిలుపుదల చేస్తే బ్రిడ్జి ఉపయోగంలేకుండా పోతుందని తాను డబ్బులు వెచ్చించి నిర్మాణం పూర్తిచేయించానన్నారు. మీకో సొంత మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, నీతిమాలిన రాజకీయాలు చేయడం సరికాదన్నారు. నాకు కాంట్రాక్టర్‌ కమీషన్లు ఇచ్చానని చేసిన ఆరోపణలపై దేవుని సాక్షిగా ప్రమాణం చేసేందుకు దామచర్ల సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. నేను సాయిబాబా ఆలయం, వెంకటేశ్వరస్వామి గుడికి ఎక్కువగా వెళుతుంటానని అక్కడ ప్రమాణం చేసేందుకు సిద్ధం అన్నారు. జనార్దన్‌ కూడా ఆయన బిడ్డల మీద ఏ ఆలయంలో ప్రమాణం చేస్తారో చెప్పాలన్నారు. కమీషన్లు ఎవరికి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్‌ చెప్పాలని, అందుకు ఆయనను కూడా ప్రమాణానికి తీసుకురావాలని జనార్దన్‌కు స్పష్టం చేశారు. ఎదురు డబ్బులు తాము పెడితే తమపై నిందలు వేయడం ఏమిటంటూ మండిపడ్డారు. టీడీపీ జిల్లా ఇన్‌చార్జిగా వచ్చిన దేవినేని ఉమ కూడా ఇద్దరికి ఇద్దరు సరిపోయారన్నారు. అసలు ఏం జరిగిందనేది కనుక్కోవాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ద్వారా ఉమ క్యారెక్టర్‌ కూడా దెబ్బతింటుందని గుర్తుంచుకోవాలన్నారు. ఇది మంచిపద్ధతి కాదని, తాను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ సవాల్‌ స్వీకరించేందుకు జనార్దన్‌ సిద్ధం కావాలని బాలినేని సవాల్‌ విసిరారు.

కమీషన్లు ఎవరు తీసుకున్నారో దేవుని సాక్షిగా ప్రమాణం చేయాలి నేను రూ.40 లక్షల మెటీరియల్‌ ఇప్పిస్తే నాపై నిందలా దామచర్ల జనార్దన్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాలినేని ఫైర్‌ తెలుసుకొని మాట్లాడమంటూ దేవినేని ఉమకు చురకలు

Advertisement
Advertisement