
ఒంగోలు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలానికి చెందిన పోలినేని కోటేశ్వరరావును వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
‘తానా’ కవయిత్రుల సమ్మేళనానికి జ్యోతిర్మయికి ఆహ్వానం
ఒంగోలు మెట్రో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఈనెల 24వ తేదీన, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నారీ సాహిత్య భేరీ అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనానికి జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో కవిత్వం వినిపించేందుకు తనకు స్థానం కల్పించినందుకు తానా అధ్యక్షుడు నిరంజన్ శంగవరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌కి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే ఈ సాహిత్య సమ్మేళనంలో భారత్‌తో పాటు విశ్వవ్యాప్తంగా సుమారు 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచయిత్రులు, వీరితో పాటు ప్రముఖ మహిళలు పాల్గొంటారు. జ్యోతిర్మయికి ఈ అవకాశం రావడంపై నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, అధ్యక్షురాలు చిన్నలక్ష్మి కళావతి, ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబు హర్షం వ్యక్తం చేసి తమ అభినందనలు తెలిపారు.
9 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు ఆర్‌ఐలుగా పదోన్నతి
ఒంగోలు అర్బన్: రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులకు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ప్రకాశం భవనంలో పదోన్నతి పొందిన ఉద్యోగులకు నియామక పత్రాలు కలెక్టర్ అందజేశారు. ముండ్లమూరులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పీ శ్రీధర్‌బాబును ఆర్‌ఐగా సీఎస్‌పురం తహశీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్‌లో టైపిస్ట్‌గా పనిచేస్తున్న బీ వరకుమార్‌ను కొత్తపట్నం, కలెక్టరేట్‌లో జూ.అసిస్టెంట్‌గా ఉన్న ఎస్‌వీ ప్రసాద్‌ను కొండపి, కలెక్టరేట్‌లో ఉన్న కే శ్రీకాంత్‌ను కొనకనమిట్ల, చీమకుర్తిలోని జీ విజయప్రసూనను టంగుటూరు, మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్‌వీ సుబ్బారావును మార్కాపురం తహశీల్దార్ కార్యాలయం, వీవీపాలెం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీహెచ్ ప్రభావతిని నెల్లూరు కలెక్టరేట్, కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న పీవీ రామతేజను దొనకొండ తహశీల్దార్ కార్యాలయం, చీమకుర్తి తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న బీ రమేష్‌బాబును పొదిలి తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పదోన్నతి పొందిన వారితో కలెక్టర్ దినేష్ కుమార్