
విచారణ చేస్తున్న అదనపు ఎస్పీ
● అడిషనల్ ఎస్పీ శ్రీధర్‌రావు
మార్కాపురం: మార్కాపురం సబ్‌డివిజన్‌లో జరుగుతున్న దొంగతనాలు, నేరస్తుల కదలికలపై నిఘా పెట్టాలని జిల్లా అదనపు ఎస్పీ క్రైం శ్రీధర్‌రావు స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. పట్టణ శివార్లలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ ఆటో షోరూమ్‌లో మంగళవారం దొంగతనం జరిగింది. రూ.5 లక్షల నగదు, ల్యాప్‌ట్యాప్‌ను అపహరించారు. ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ బుధవారం పట్టణంలో కాలేజీ రోడ్డులో దొంగతనం జరిగిన షోరూంను పరిశీలించారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ భీమానాయక్ పలు సూచనలు చేశారు. దొంగతనం జరిగిన షోరూం సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్‌ను దొంగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నైట్ బీట్‌లను పెంచాలని, అనుమానాస్పద వ్యక్తులను వెంటనే అదుపులోనికి తీసుకుని విచారణ చేయాలని ఆదేశించారు. కేసులో నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ భీమానాయక్ అదనపు ఎస్పీకి చెప్పారు.