ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

ఒంగోలు: ఇంటర్ సప్లిమెంటరీ, అడ్వాన్స్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షకు 6263 మంది హాజరుకావాల్సి ఉండగా 5484 మంది మాత్రమే హాజరయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1686 మంది హాజరుకావాల్సి ఉండగా 1360 మంది మాత్రమే హాజరయ్యారని ఆర్‌ఐవో సైమన్ విక్టర్ తెలిపారు.
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
ఒంగోలు: ఉచిత వసతి, భోజనం, శిక్షణ తరగతులు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు స్కిల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఆర్.లోకనాథం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కిల్ కాలేజీల్లో హై టెక్నికల్ రిలేటెడ్ కోర్సులైన పేషెంటు రిలేషన్స్ సర్వీసెస్ డ్యూటీ మేనేజర్ కోర్సులను 5 నెలలపాటు ఉచిత శిక్షణ, భోజన, వసతి సదుపాయంతో అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం తగిన ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9988853335 ను సంప్రదించాలన్నారు.
29న హజ్ శిక్షణ,
వ్యాక్సినేషన్ క్యాంప్
ఒంగోలు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ సూచనల మేరకు జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్–2023 శిక్షణ, వ్యాక్సినేషన్ క్యాంపు ఈ నెల 29వ తేదీ కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. హజ్–2023 సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9246482333, 94402 52387, 85558 08533 నంబర్లను సంప్రదించాలన్నారు.
నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీల సర్టిఫికెట్ల పరిశీలన
ఒంగోలు: ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈవో పి.రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు 2018 నవంబరు 18వ తేదీకి ముందు, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో హెడ్మాస్టర్లుగా కొనసాగుతున్నవారు, 2015 నవంబరు 18వ తేదీకి ముందు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నవారు తప్పనిసరిగా తమ బదిలీల దరఖాస్తును ఆన్‌లైన్‌లో ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన బదిలీల దరఖాస్తులను ఈనెల 27వ తేదీ వరకు పరిశీలిస్తారన్నారు. 28, 29 తేదీల్లో ప్రాథమిక సీనియార్టీ జాబితాను విడుదల చేస్తామని, 30న అభ్యంతరాల స్వీకరణ, ఈనెల 31, జూన్ 1వ తేదీ అభ్యంతరాల పరిష్కారం, జూన్ 2, 3 తేదీల్లో తుది సీనియార్టీ జాబితా విడుదల చేస్తారన్నారు. జూన్ 4న ఉపాధ్యాయుల ఖాళీల ప్రదర్శన ఉంటుందని, హెడ్ మాస్టర్లు జూన్ 5, 6 తేదీల్లో, స్కూల్ అసిస్టెంట్లు జూన్ 5 నుంచి 7వ తేదీ వరకు, సెకండరీ గ్రేడ్‌టీచర్లు జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. హెడ్మాస్టర్లకు, స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 9న, సెకండరీ గ్రేడ్ టీచర్లకు జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు జాబితా జనరేషన్ ఉంటుందని డీఈవో పి.రమేష్ పేర్కొన్నారు.
పశుసంవర్ధక సహాయకుల జిల్లా అధ్యక్షుడిగా రంగనాథ్
నాగులుప్పలపాడు: ప్రకాశం జిల్లా పశు సంవర్ధక సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ముప్పాళ్ల గ్రామానికి చెందిన మాచిరాజు రంగనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రాత్రి ఒంగోలులో నిర్వహించిన పశు సంవర్ధక సహాయకుల ఎన్నికల్లో రంగనాథ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 10 మంది కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని కండ్లగుంట గ్రామ సచివాలయంలో పశు సంవర్ధక సహాయకులుగా పనిచేస్తున్న రంగనాథ్ ఎంపిక పట్ల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ విజయానంద్ నేడు రాక
ఒంగోలు: ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ విజయానంద్ గురువారం ఒంగోలులో విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన స్థానిక ఏపీసీపీడీసీఎల్ ఒంగోలు సర్కిల్ కార్యాలయానికి చేరుకుంటారు. ప్రాజెక్టు ల ఎస్‌ఈ, ట్రాన్స్‌కో ఆపరేషన్స్ అండ్ మెయింటైనెన్స్ ఎస్‌ఈతోపాటు డిప్యూటీ ఈఈలు సమీక్షకు హాజరుకానున్నారు. సాయంత్రం 2.30 గంటలకు విజయవాడకు బయల్దేరతారు.