ప్రజలకు మెరుగైన సేవలు

కంభం సర్కిల్‌తో
కంభం: స్నేహ పూర్వక పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ మలికా గర్గ్ అన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో కంభంలో సర్కిల్ ఏర్పాటు చేయగా పట్టణంలోని పాతపోలీస్ స్టేషన్‌ను నూతన హంగులతో రీమోడలింగ్ చేసి రూపొందించిన కార్యాలయాన్ని బుధవారం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుతో కలసి ఎస్పీ ప్రారంభించారు. ముందుగా కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కొత్తగా కంభం సర్కిల్ ఏర్పాటు చేశారని, గతంలో ఈ ప్రాంత ప్రజలు వారి ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు దూరంగా ఉన్న మార్కాపురం వెళ్లాల్సి వచ్చేదన్నారు. నూతన సర్కిల్ కార్యాలయం ఏర్పాటు ద్వారా అర్థవీడు, బేస్తవారిపేట, కంభం ప్రజలకు ఆ ఇబ్బంది తప్పిందని చెప్పారు. సర్కిల్ కార్యాలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యాలయ పనులు త్వరితగతిన పూర్తి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, సహాయ సహకారాలు అందించిన ప్రజాప్రతినిధులు, ప్రజలకు అభినందనలు తెలిపారు. నిరంతర విధి నిర్వహణలో ఉండే పోలీసులు విశ్రాంతి తీసుకోడానికి వీలుగా విశ్రాంతి భవనం నిర్మించారన్నారు. సర్కిల్ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని సూచించారు. సమస్యల్లో ఉన్న బాధితులకు సత్వర న్యాయం చేస్తూ డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు మాట్లాడుతూ కంభంలో నూతన సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల అర్థవీడు, బేస్తవారిపేట, కంభం మండల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సర్కిల్ కార్యాలయ నిర్మాణానికి సహకరించిన దాత లందరికీ అభినందనలు తెలిపారు. నూతన సర్కిల్‌లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, డీఎస్‌బీ డీఎస్పీ బి.మరియదాసు, కంభం, మార్కాపురం, గిద్దలూరు సీఐ యం.రాజేష్, భీమానాయక్, ఫిరోజ్, సర్కిల్ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, వెంకటేశ్వర నాయక్, మాధవరావు, ఎంపీపీ చేగిరెడ్డి తులశమ్మ, కంభం సర్పంచ్ పల్నాటి బోడయ్య, అర్థవీడు జెడ్పీటీసీ చెన్నువిజయ, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎస్పీ మలికాగర్గ్ నూతన సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ, ఎమ్మెల్యే