
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ అమరావతిలో ఉద్యమం చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సోమవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అమరావతిలో 5 గంటలు దీక్ష చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కారణమైన బీజేపీపై ఢిల్లీలో ఉద్యమం చేస్తే బాగుంటుందన్నారు.
కాపు కులాన్ని పెట్టుబడిగా పెట్టి.. ప్యాకేజీలను రాబట్టుకోవాలనేదే పవన్ సిద్ధాంతమని విమర్శించారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఏడేళ్లయినా.. ఇప్పటికీ ఆ పార్టీకి ఒక స్టాండ్ లేదని, అసలు సిద్ధాంతాలే లేకుండా నడుపుతున్న ఏకైక పార్టీ అని ఎద్దేవా చేశారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏకైక పార్టీ జనసేన ఒక్కటే అన్నారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం తప్పులేదట.. వైఎస్సార్‌సీపీదే తప్పు అట. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవడమే తప్ప పవన్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు’ అని విమర్శించారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని, తమ నాయకుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండుసార్లు పీఎం నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారా అని అమర్‌నాథ్ నిలదీశారు. అమరావతే రాజధాని అంటూ.. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు జనసేన అధినేత పవన్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో అసెంబ్లీలో మూడు రాజధానుల నూతన బిల్లును పెట్టనున్నామని, ముమ్మాటికీ విశాఖ పరిపాలన రాజధాని అయ్యి తీరుతుందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి ఉత్తరాంధ్ర ద్రోహులు ఎవరు అడ్డు వచ్చినా ఆగేది లేదన్నారు.
చదవండి: పవన్‌కల్యాణ్ ఆవు కథ.. ఏకిపారేసిన అంబటి రాంబాబు