అనివార్యతే వేటుకి కారణమైందా? | Uttarakhand CM Trivendra Singh Rawat resigns | Sakshi
Sakshi News home page

అనివార్యతే వేటుకి కారణమైందా?

Jul 4 2021 3:35 AM | Updated on Jul 4 2021 3:35 AM

Uttarakhand CM Trivendra Singh Rawat resigns - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేవభూమి ఉత్తరాఖండ్‌లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. సుమారు 4 నెలల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్‌ రావత్‌ నుంచి అధికారపగ్గాలు చేపట్టిన తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీరత్‌ సింగ్‌ స్థానంలో పుష్కర్‌ సింగ్‌ ధమీని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసినప్పటికీ అసలు ఆయనను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తీరత్‌ సింగ్‌ ఎందుకు పగ్గాలను వదులుకోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  

115 రోజుల ముఖ్యమంత్రి
తీరత్‌ సింగ్‌ రాజీనామాకు రాజ్యాంగ సంక్షోభమే కారణం లేక రాష్ట్రంలో ప్రస్తుతం ఆగ్రహంగా ఉన్న పూజారులు, సాధుసంతువులు, భక్తులే కారణమా అనేది నేరుగా చెప్పడం కష్టమైన అంశం. అయితే త్రివేంద్ర సింగ్‌ రావత్‌ని సీఎం పదవి నుంచి తప్పించడంలో, తీరత్‌ సింగ్‌ రావత్‌ను అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో రాష్ట్రంలోని పూజారులు, సాధువుల అసంతృప్తే ప్రధాన కారణమని స్పష్టమౌతోంది. రావత్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితిలో మార్పు వస్తుందని సాధువులు, పూజారులు భావించారు. కానీ, సీఎంగా ఈ 115 రోజుల్లో తీరత్‌ సింగ్‌ రావత్‌ వారు ఊహించిన విధంగా అద్భుతాలు ఏవీ చేయలేకపోయారు. కాగా అనేక వివాదాస్పద ప్రకటనలు చేశారు.  

పార్టీపై ప్రజల్లోని ప్రతికూలతలు దూరం అవుతాయా?
వచ్చే ఏడాది మొదట్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం మరోసారి అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే అక్కడ ఉన్న సాధువులు, పూజారులు, వారి భక్తులను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన గత్యంతర పరిస్థితి ఉంది. అందువల్లే దేవభూమిలో ముఖ్యమంత్రి మార్పు ఇప్పుడు అనివార్యంగా మారింది. ఎన్నికల్లోగా పార్టీపై క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతికూలతలను దూరం చేయడంలో తీరత్‌ సింగ్‌ వైఫల్యం చెందడంతో పాటు, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టం చేకూర్చాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

తీరత్‌ సింగ్‌ను కొనసాగించడానికి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోగా ఎలాంటి ఉప ఎన్నికలను నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టత ఇవ్వడంతో ఆయనతో రాజీనామా చేయించారని తీరత్‌ సన్నిహితులు తెలిపారు.  కానీ, కమలదళంలో అంతర్గత విబేధాలు, ఫిర్యాదులు, అసంతృప్తి కారణంగానే తీరత్‌ను పక్కనబెట్టారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్లే పార్టీ హైకమాండ్‌ సమాలోచనలు జరిపి ప్రజల్లో సరళమైన ఇమేజ్‌ ఉన్న పుష్కర్‌ సింగ్‌ ధమీని ఎంపికచేసింది. ఆయన ధుమ్కా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండడంతో తీరత్‌ సింగ్‌ విషయంలో ఎదురైన రాజ్యాంగ సంక్షోభం మరోసారి ఏర్పడరాదనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ పేరును ప్రతిపాదనల నుంచి తప్పించారని తెలిసింది.  

దేవస్థానం బోర్డుపై నియంత్రణ కారణమా...:
రాష్ట్రంలో దేవస్థానం బోర్డుపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుండటంపై అర్చక సమాజం ఆగ్రహంగా ఉంది. త్వరలోనే 51 దేవాలయాలను, ఉత్తరాఖండ్‌ దేవస్థానం బోర్డును ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పిస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌ 9న తీరత్‌ సింగ్‌ రావత్‌ తన పుట్టిన రోజున హరిద్వార్‌లో హామీ ఇచ్చారు. కానీ ఈ నిర్ణయంపై ఎలాంటి పురోగతి లేదు. దీంతో పూజారులు ధర్నా మొదలుపెట్టారు. దేవస్థానం బోర్డు రద్దు చేయాలని కోరుతూ జూన్‌ 29న చార్‌ధామ్‌ తీర్థ్‌ పురోహిత్‌ మహా పంచాయత్‌ సమితి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విశ్వహిందూ పరిషత్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లకు సైతం మహా పంచాయత్‌ లేఖలు రాసి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది.

కొంపముంచిన చార్‌ధామ్‌ యాత్ర రద్దు
ఉత్తరాఖండ్‌ జీవనాడి అయిన చార్‌ధామ్‌ యాత్ర రద్దు వ్యవహారంలోనూ పూజారులు ఆగ్రహంగా ఉన్నారు. యాత్రను రద్దు చేయాలని ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తీరత్‌ సింగ్‌ ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా తీరత్‌ సింగ్‌ రావత్‌ సాధువుల సమాజానికి ఎలాంటి రక్షణ ఇవ్వలేరనే విధంగా ఒక సందేశం ప్రజల్లో ప్రచారమైంది. ఇలాంటి అనేక కారణాల వల్ల తప్పని సరి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కమలదళం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement