
న్యూఢిల్లీ: తెలంగాణ మోడల్ అభివృద్ధి అంటే సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు రాకపోవడమా? అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణ మోడల్ అభివృద్ధి అంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్న దానిపై కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి అంటే సెక్రటేరియట్ కు రాకపోవడమా ?, తొమ్మిది ఏళ్లుగా ప్రజలను కలవకపోవడం ఆదర్శమా?, ఈ మోడల్ దేశంలో ప్రవేశ పెడతారా?, దీనికోసం విమానాల పెట్టుకొని తిరుగుతారా?, టీఎస్ఏండీసీ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు.
కేసీఆర్‌కు దమ్ముంటే తన మాట నిలబెట్టుకోవాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని మాత్రమే విభజన చట్టంలో ఉంది. విభజన చట్టం మేరకు నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేసింది. బయ్యారంలో నాణ్యమైన ముడి ఇనుప ఖనిజం లేదు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దానివల్ల ప్రపంచ స్థాయి ఉక్కు తయారు కాదు అని నివేదికలో చెప్పారు. పట్టింపులకు వెళ్లి పరిశ్రమ పెడితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు పెట్టలేదు. అప్పుల, మద్యం తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారు. తెలంగాణపై కేంద్రాపనికి ఎలాంటి వివక్ష లేదు కనుకే అవార్డులు వస్తున్నాయి’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.