విజయ్‌ VS ఉదయనిధి.. అసెంబ్లీ ఇలా దద‍్దరిల్లాల్సిందే.. | tvk vijay and udayanidhi stalin in tamil nadu assembly | Sakshi
Sakshi News home page

విజయ్‌ VS ఉదయనిధి.. అసెంబ్లీ ఇలా దద‍్దరిల్లాల్సిందే..

May 5 2026 6:14 PM | Updated on May 5 2026 7:16 PM

tvk vijay and udayanidhi stalin in tamil nadu assembly

AI Representative Images

తమిళనాడు రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమైంది. అసెంబ్లీలో ఇప్పుడు ప్రధానంగా కనిపించబోయే పోరు టీవీకే నేత విజయ్‌, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ మధ్యనే సాగనుంది. ఒకరు కాబోయే సీఎం, మరొకరు కాబోయే ప్రతిపక్ష నేత. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన విజయ్‌ ఒకవైపు, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించబోయే ఉదయనిధి మరోవైపు ఉండటంతో సభ చర్చలు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. ఉదయనిధికి ఉన్న పాలనా అనుభవం ముందు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారనేది కీలకం.

అసెంబ్లీలో జరిగే వాగ్వివాదాలు ఈ ఇద్దరు నేతల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. పాలన, సంక్షేమం, చట్టం, వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యంగా మాట్లాడాల్సింది ఈ ఇద్దరు నేతలే. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం ఎంతవరకు విజయవంతం అవుతుంది? ప్రతిపక్షం ఎంత బలంగా నిలబడుతుంది? అన్నదే ముందున్న రాజకీయ దిశను నిర్ణయిస్తుంది. ఆ వ్యవహారాలే భవిష్యత్తులో విజయ్‌ను మరోసారి సీఎంగా నిలబెడతాయి. ఇక, ఉదయనిధి స్టాలిన్‌ బలంగా పనిచేస్తేనే విజయ్‌ను సీఎం పీఠం నుంచి దించి, మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తోంది. మొత్తంగా చూస్తే, విజయ్‌-ఉదయనిధి మధ్య ఈ రాజకీయ పోరు తమిళనాడు రాజకీయాలకు కొత్త శక్తిని తీసుకురానుంది. సభలో ప్రతి చర్చ ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉండటం ఖాయం.

తమిళనాట ఓ ఆశగా విజయ్‌
బాలనటుడి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు ఎదిగారు టీవీకే విజయ్‌. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే శాసనసభా పక్ష నేతగా ఇప్పటికే విజయ్‌ ఎన్నికయ్యారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు ఉండనున్నాయి. పాత పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ రెండు పార్టీలే తప్ప మరో పార్టీ లేదా? అనుకుంటున్న సమయంలో తమిళనాట ఓ ఆశగా వెలిగారు విజయ్‌. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని కొందరు అంటున్న సమయంలో పార్టీని పెట్టి.. పోటీ చేసిన తొలిసారే అధికారంలోకి తీసుకొచ్చారు.  

డీఎంకే ఆశ అంతా ఉదయనిధిపైనే..
మరోవైపు, తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా తనను నియమించే నిర్ణయం పార్టీ నాయకత్వానిదేనని ఉదయనిధి స్టాలిన్ మంగళవారం తెలిపారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేసిన ఉదయనిధి స్టాలిన్‌.. ఈ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గంలో గెలిచారు. శాసనసభా పక్ష నేత విజయ్‌తో పోరాడాల్సిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలినే.

ఇద్దరిదీ ఒకే వయసు.. ఇరువురూ సినీనటులే
ఉదయనిధి స్టాలిన్‌ వయసు 49 సంవత్సరాలు. విజయ్‌ వయసు 51. దాదాపు ఒకటే ఏజ్‌. తమిళనాడు భవిష‍్యత్తు రాజకీయాలు అంతా వీరిద్దరి కేంద్రంగానే జరిగే అవకాశం ఉంది. ఒకరు సీఎంగా, మరొకరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాటల తూటాలు పేల్చుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్‌, జయలలిత వంటి వారు కూడా తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏలారు. 

కాగా, దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల ముఖచిత్రం మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకులుగా గుర్తింపు పొందిన విజయ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పోరు అసెంబ్లీ వేదికగా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. విజయ్‌, ఉదయనిధి ఇద్దరూ సినీనటులే. అయితే, విజయ్‌ సినిమాల్లో హిట్స్‌ అధికంగా ఉండడంతో ఆయనకు అభిమానులు విపరీతంగా ఉన‍్నారు. విజయ్‌ జననాయగన్ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెబుతానన్నారు. ఉదయనిధి కూడా సినిమాలకు గుడ్‌బై చెప్పి, నటనకు విరామం తీసుకుంటున్నట్లు 2023లోనే తెలిపారు.

ఒకరు కొత్త.. మరొకరిది వారసత్వ రాజకీయం
విజయ్‌ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా రాజకీయాల్లో ఇంతగా రాణించడం ఓ అద్భుతం. ఉదయనిధి స్టాలిన్‌ రాజకీయాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతోంది. డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. తాత, తండ్రి వారసత్వం నుంచే స‍్వతహాగా రాజకీయాలను నేర్చుకున్నారు. అధికార పక్షాన్ని ఎలా ఇరుకున పెట్టొచ్చో ఆయనకు తెలుసు. అయితే, విజయ్‌ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ ప్రజలను ఆకర్షించే తత్వం ఉంది. 

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధానాలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తన పాలనలో విజయ్‌ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులోని లోపాలు, లొసుగులను ఎత్తి చూపుతుంది. వీటన్నింటి ఆధారంగా విజయ్‌పై విమర్శలు చేసే పాత్ర పోషించాల్సింది ఉదయనిధి స్టాలినే. 

ఉదయనిధి స్టాలిన్‌కు ఇది కీలక దశ. అధికారంలో ఉన్న సమయంలో పొందిన అనుభవాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. సభలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించడం ఆయన ప్రధాన బాధ్యతగా మారనుంది. డీఎంకే వారసుడిగా, కరుణానిధి మనవడిగా, ఉదయనిధికి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు, పార్టీకి సంబంధించిన అనుభవం ఆయనకున్న ప్రధాన బలాలు.

Advertisement
 
Advertisement
Advertisement