చెన్నై: కొందరు నేతలు దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ, దళితుల కోసం చేసేది ఏమీ ఉండదు. కొందరు నేతలు మాత్రం దళితుల కోసం అహర్నిశలు కష్టపడతారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. రాజకీయాల్లోకీ వారిని తీసుకొస్తారు. వారి వెనక ఉండి గెలిపిస్తారు. దళితులు ఏ ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏ ప్రాంతంలో మోసాలకు, అణచివేతలకు గురవుతున్నా అక్కడికి వెళ్లి మరీ వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. అటువంటి నేతే తిరుమావళవన్.
తిరుమావళవన్ దళితుల హక్కుల కోసం తమిళనాడులో దీర్ఘకాలంగా ఉద్యమాలు చేపట్టిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1990లలో తమిళనాడులో దళితులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా తిరుమావళవన్ నిర్వహించిన సభలు, నిరసనలు పెద్ద ఎత్తున దళిత యువతను రాజకీయంగా చైతన్యపరిచాయి.
కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం అంశాలను ఆయన నిరంతరం ముందుకు తెచ్చారు. హిందుత్వ రాజకీయాలు దళితులపై ప్రభావం చూపుతున్నాయని విమర్శిస్తూ, దళితుల రాజకీయ ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. కుల హింస ఘటనల్లో బాధితులకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వ చర్యలు కోరారు. శ్రీలంక తమిళ శరణార్థుల సమస్యపైనా తిరుమావళవన్ గళం విప్పారు. ఎన్నికల్లో పోటీ చేసి, 2001లో ఎమ్మెల్యేగా అయ్యారు. 2009, 2019, 2024లో చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
రిజర్వ్ స్థానాలకే దళిత రాజకీయ నాయకులు, పార్టీలను పరిమితం చేసే రాజకీయ వ్యవస్థలో.. ప్రభుత్వాలకు బయట నుంచి మద్దతు ఇవ్వడమే కాదు, అధికార భాగస్వామ్యంలో కూడా దళిత పార్టీలకు స్థానం ఉండాలన్న తిరుమావళవన్ దీర్ఘకాల డిమాండ్ ఇప్పుడు నెరవేరుతోంది.
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ టీవీకే విజయ్‌కు మద్దతు ఇచ్చి ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ. ఈ పార్టీ మొదట “దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా” పేరుతో 1982లో ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత “విదుతలై చిరుతైగళ్ కచ్చి”గా రాజకీయ పార్టీగా మారింది. తమిళనాడు రాజకీయాలను మార్చిన దళిత పార్టీగా వీసీకే నిలిచింది. ఈ పార్టీని స్థాపించిన వారు ఎం.మలల్చామి, డి.అముకురాజా. ప్రస్తుత వీసీకే ఛైర్‌పర్సన్‌గా తోల్ తిరుమావళవన్ ,
ప్రధాన కార్యదర్శిగా డి.రవికుమార్ ఉన్నారు.
దళితుల ఆశాజ్యోతి
తమిళనాడులో దళితుల కోసం తిరుమావళవన్ చేసిన కృషి అంతాఇంతా కాదు. ఇప్పటిది కాదు. 1996లో చిదంబరం దక్షిణ కార్ వీధిలో నిలబడి తిరుమావళవన్ నినాదాలు చేస్తూ దళితుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అణచివేతను మౌనంగా భరించేందుకు అలవాటు పడ్డ అనేక మంది దళిత యువతలో అది రాజకీయ చైతన్యానికి నాంది పలికింది.
వీసీకే రాజకీయాల్లోకి 1999లో అధికారికంగా అడుగుపెట్టింది. 2024లో వీసీకే తమిళనాడులో అతిపెద్ద దళిత పార్టీగా ఎదిగింది. తాజా ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్నా.. వీసీకే ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు వేళ విజయ్ టీవీకేకు మద్దతు ఇచ్చి, తమిళనాడు రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా ఎదిగింది. వీసీకే ప్రస్తుత అవకాశాలు, భవిష్యత్ దిశ ఇప్పటికీ ప్రధానంగా తిరుమావళవన్ వ్యక్తిత్వం, రాజకీయాలపైనే ఆధారపడి ఉన్నాయి.
దళితుల సామాజిక న్యాయం, సాధికారతపై అంబేద్కర్ భావజాలం, హేతువాదం, సామాజిక సంస్కరణ, కుల వ్యతిరేక ఉద్యమంపై పెరియార్ భావజాలం, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకత, కార్మిక విముక్తిపై మార్క్స్ భావజాలం.. వీటన్నింటినీ సమ్మిళితం చేశారు తిరుమావళవన్. అణచివేత, అసమానతల అనేక పార్శ్వాలను ఎదుర్కొన్నప్పుడే విముక్తి సాధ్యమని ఆయన నమ్ముతా. వాటినే తిరుమావళవన్ ముందుకు తీసుకువెళ్తూ దళితుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.
దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలు తిరుమావళవన్‌ను తమ ఏకైక ఆశగా భావిస్తున్నారు. హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా చురుకుగా పోరాడుతున్న తమిళనాడులోని ఏకైక కుల వ్యతిరేక పార్టీ వీసీకేనని వారు చెబుతున్నారు.
ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుచుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే రాజకీయ ప్రయాణంలో కొత్త దశకు నాంది పలికాయి. తిరుమావళవన్ కృషి ఎన్నికల తర్వాత దాని ప్రాధాన్యం మరింత పెరిగింది. తమిళనాడులో హంగ్ రావడంతో ప్రభుత్వం ఏర్పాటు వేళ వీసీకే కీలక పాత్ర పోషిస్తోంది.


