ఆదివాసీల గుడిసెల తొలగింపు.. కేసీఆర్ పాలనకు ముగింపు

సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల గుడిసెల తొలగింపుతో సీఎం కేసీఆర్ తన పాలనకు ముగింపు పలికారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. శనివారం ఆమె మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయ పోచగూడలో ఆదివాసీల గుడిసెల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోడు పట్టాల కోసం పోరాడుతున్న ఆదివాసీ ఆడ బిడ్డలను వివస్త్రలను చేయడం నయా నిజాం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.
వాస్తవానికి తెలంగాణలో పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. కుర్చీ వేసుకుని మరీ పోడు భూముల లెక్క తేల్చుతా అని అన్న మాటలు గుర్తు లేవా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లు అని కూడా పోలీసులకు కనికరం లేదని, ఒంటి మీది బట్టలు ఊడిపోతున్నా చూడకుండా ఈడ్చి పడేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మొన్న చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టించారు.
ఇయ్యాల ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు’ అని పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ వాయిదా పడింది. ఈనెల 10న పునఃప్రారంభం కావాల్సిన పాదయాత్రను ఈనెల 12కి వాయిదా వేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. షర్మిల తన పాదయాత్రను తిరిగి హుజూర్‌నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మలచెరువు నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తెలిపారు.