రేవంత్‌ ఆరోపణలన్నీ అబద్ధాలే..

Telangana: Minister Malla Reddy Strong Counter To Revanth Reddy - Sakshi

నకిలీ కాగితాలు తెచ్చి నమ్మించాలని చూస్తున్నాడు  

టీడీపీలో ఉన్నప్పటి నుంచే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు 

కాంగ్రెస్‌ మీటింగ్‌ల పేరిట వసూళ్లు చేస్తున్నాడు 

మంత్రి మల్లారెడ్డి ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: ‘భూ ఆక్రమణలకు సంబంధించి రేవంత్‌రెడ్డి నాపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే. నకిలీ కాగితాలను తెచ్చి నమ్మించేందుకు రేవంత్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను అప్పట్లోనే చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లా. సమాచార హక్కు చట్టాన్ని వాడుకుని పబ్బం గడుపుకునే వ్యక్తి రేవంత్‌’ అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో కలసి శనివారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘టీపీసీసీని రేవంత్‌రెడ్డి సర్కస్‌ కంపెనీలాగా మార్చాడు. కాంగ్రెస్‌లో కొంతమందిని బకరాలను చేసి మీటింగ్‌ల పేరిట వసూళ్లు చేస్తున్నాడు. రేవంత్‌కు ఎవరెవరు ఎంత ఇచ్చారో.. నా దగ్గర వివరాలు ఉన్నాయి. నాకు 600 ఎకరాలకు రైతుబంధు వస్తోందని ఎమ్మెల్యే సీతక్క ద్వారా ఆరోపణలు చేయిస్తూ ఆమెను కూడా పక్కదారి పట్టిస్తున్నాడు’ అని మల్లారెడ్డి విమర్శించారు. తనకు ఉన్న భూమిలో 400 ఎకరాల్లో కాలేజీలు ఉంటే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘తెలంగాణకు దేవుడి లాంటి కేసీఆర్‌ను తిడితే మాకు కోపం రాదా? సీఎంను తిట్టేందుకే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారా, రేవంత్‌ బ్లాక్‌మెయిలింగ్‌ను త్వరలో బయట పెడతా’అని మల్లారెడ్డి హెచ్చరించారు. 

పార్లమెంటులో క్లీన్‌చిట్‌ ఇచ్చారు.. 
‘రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది నాలాంటి పెద్ద మనిషిని వేధించేందుకేనా? జవహర్‌నగర్‌లో నా కోడలి పేరిట 350 చదరపు గజాల స్థలమే ఉండగా, అందులో నిబంధనల మేరకు ఆస్పత్రి నిర్మించి పేదలకు సేవ చేస్తున్నా. పార్లమెంటులో నా విద్యాసంస్థలపై రేవంత్‌ వేసిన ప్రశ్నకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. గుండ్లపోచంపల్లిలోని 16 ఎకరాలు నా యూనివర్సిటీ ఆవరణలో లేవు. నేను కష్టపడితే ఆస్తులు సమకూరాయి. రేవంత్‌కు బంజారాహిల్స్‌ ఇల్లుతో పాటు ఏం చేశాడని అన్ని ఆస్తులు వచ్చాయి’అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఏటా రూ.2 కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని, సొంత డబ్బుతోనే ప్రజాసేవ చేస్తున్నానని స్పష్టంచేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top