ఫామ్‌హౌస్‌ పాలన కావాలా?  ప్రజాస్వామ్య పాలన కావాలా?

Telangana: Kishan Reddy Criticize CM KCR - Sakshi

ఇల్లందకుంట ప్రచారసభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలో ఫామ్‌హౌస్‌ పాలన ఉండాలా? ప్రజాస్వామ్య పాలన కావాలా? ప్రజలు తేల్చుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం హుజూరాబాద్‌ నియోజకవర్గం లోని ఇల్లందకుంట మండలం వంతడుపుల, సీతంపేట, బిజునూరు, మర్రివానిపల్లి, భోగంపాడు, సిరిసేడు గ్రామాల్లో ఆయన ఈటల రాజేందర్‌కు మద్దతుగా రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధం ముందుపుట్టి ఆ తర్వాత కేసీఆర్‌ పుట్టారని విమర్శించారు.

తెలంగాణ వచ్చాక బాగుపడింది ఒక్క సీఎం కుటుంబసభ్యులేనని మండిపడ్డారు. స్వరాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఇప్పుడెక్కడ ఉన్నా యని ప్రశ్నించారు. కేవలం ఈటల మీద గెలిచేందుకే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, అందుకే ఈ పథకానికి ఈటల రాజేందర్‌ దళితబంధు అని పేరు పెట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికలయ్యాక దళితబంధును అమలు చేయరని, దళితబంధు అమలు కావాలంటే ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.  

ఈటల మాట్లాడుతూ తాను దళితబంధును ఆపేందుకు లేఖ రాశానని కేసీఆర్‌ తనపై నిందలు వేశారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు సీఎం పదవి వారసత్వంగా వచ్చింది కాదని, ప్రజల ఓట్లతో వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. దళితబంధును తెలంగాణవ్యాప్తంగా అమలు చేయించడమే తన మొదటి యుద్ధమని, ఈ నెల 30 తర్వాత ఇక తనకు అదే పని అన్నారు. ఉపఎన్నికలో, 2023 ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే అని ఈటల ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇల్లందకుంట మండలం లోని సిరిసేడులో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top