పాలమూరులో వలసల్లేవని చూపించు

Telangana: BJP Chief Bandi Sanjay Slams On CM KCR - Sakshi

నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా

లేకపోతే నీ కుటుంబం రాష్ట్రాన్ని వదిలి పెడుతుందా?

కేసీఆర్‌కు సంజయ్‌ సవాల్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘పాలమూరులో వలసలను ఆధారాలతో సహా నిరూపించా. కేసీఆర్‌ కుటుంబానికి కళ్లు దొబ్బినై. అందుకే వలసలు లేవంటున్నరు. వలసల్లేవని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నిరూపించకపోతే నీ కుటుంబం శాశ్వతంగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తుందా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. బీజేపీ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర 20వ రోజు మంగళవారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కొనసాగింది. రాత్రి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎలా ఎండిపోయిందో, వలసలు ఎలా పోతున్నారో కనపడట్లేదా అని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్‌ చేయలేదని.. ఇప్పటికే 60 శాతం మంది రైతులు నష్టానికే ధాన్యాన్ని అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితి లేదని.. అప్పులు చేసి చిప్ప చేతికి ఇస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో ఉర్దూను చేర్చడాన్ని ఒప్పుకునేది లేదని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు బీజేపీ యువ మోర్చా సిద్ధమైందని అన్నారు.

చెక్‌డ్యాంల పేరుతో ఒకడు రూ.120 కోట్లు, ఇసుక పేరుతో ఇంకొకడు రూ.100 కోట్లు సంపాదించాడని.. సమస్యల పరిష్కారానికి చిన్న చింతకుంటలో ప్రజలు 100 రోజులు దీక్ష చేసినా ప్రభుత్వంలో స్పందన లేదని సంజయ్‌ విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఒకటేనని..రెండు పార్టీలు కలిసే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top