Sajjala Ramakrishna Reddy Serious Comments On Chandrababu, Details Inside - Sakshi
Sakshi News home page

Sajjala Ramakrishna Reddy: అధికారం అందదనే మారీచ యుద్ధం

Jul 1 2022 4:32 AM | Updated on Jul 1 2022 7:44 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిత్యం అబద్ధాలు వల్లిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాలేదని స్పష్టంగా తేలిపోవడంతో కుట్రలు, కుతంత్రాలతో మాయావి మారీచుడిలా యుద్ధం చేస్తున్నారని చెప్పారు.

సజ్జల గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఆర్‌డీఏ భూముల విక్రయం, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లపై ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించారని మండిపడ్డారు. సీఎం జగన్‌ మేనిఫెస్టో హామీల్లో 95 శాతం ఇప్పటికే అమలు చేశారని గుర్తు చేశారు.

కేవలం 5 శాతం మిగిలిపోతే ఫెయిల్‌ అయినట్లా? అని ప్రశ్నించారు. చెప్పనివి కూడా చాలా చేశారని తెలిపారు. ఏ ఇంటికి వెళ్లినా సంక్షేమ పథకాలు అందాయని, నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు చెబుతున్నారన్నారు. సుపరిపాలనకు ఇంతకన్నా ప్రజాతీర్పు ఇంకేం కావాలన్నారు. 

నాటి జీవో ప్రకారమే సీఆర్డీఏ ముందుకు..  
సీఆర్‌డీఏపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. రాజధానితో సంబంధం లేకుండా అభివృద్ధి పనుల్లో భాగంగా లేఅవుట్ల డెవలప్‌మెంట్‌కు వనరులను సమకూర్చుకుంటుంటే అక్కడేదో ఘోరాలు జరిగిపోతున్నట్లు ప్రతిపక్షం రభస చేస్తోంది. అమరావతిలో సీఆర్డీఏ ఎకరా రూ.10 కోట్లకు ఎలా అమ్ముతుందని ప్రశ్నిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవో ఆధారంగా సీఆర్డీఏ ముందుకు వెళితే హాహాకారాలు చేస్తున్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మార్ట్‌గేజ్‌ ముద్దు అయింది. ఈరోజు లే అవుట్లను అభివృద్ధి చేస్తుంటే రెచ్చగొడుతున్నారు. భూములిచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. యాన్యుటీని 15 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వం ఏం చేస్తుందనేది అక్కడున్న రైతులకు, వ్యవసాయ కూలీల కుటుంబాలకు తెలుసు. రింగ్‌రోడ్డు, కరకట్ట రోడ్ల విస్తరణ, లేఅవుట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత సర్కార్‌ చేసిన పనుల కంటే మెరుగ్గా చేస్తున్నాం.  

మద్యం అమ్మకాలపై విషప్రచారం... 
మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. చంద్రబాబు, టీడీపీ ప్రాణం ఎల్లో మీడియాలో ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 వాళ్లే అజెండా ఫిక్స్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డిస్టిలరీల కెపాసిటీ పెంచుతూ అనుమతులు ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాకున్నా ఏపీ మద్యంలో విషం తయారు అవుతోందంటూ దుష్ప్రచారానికి దిగారు.

ఆ రోజు ప్రమాణాలు, ఇవాళ ప్రమాణాల్లో తేడా ఏమీ లేదు. మినరల్‌ వాటర్‌ అయినా, హెరిటేజ్‌ పాలైనా జాతీయ స్థాయి ప్రమాణాలే పాటించాలి. ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి రావాలి. వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌పై ఉన్న ద్వేషంతో ప్రభుత్వాన్ని ఒక క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు.

ల్యాప్‌టాప్‌లు ఆప్షన్‌ 
విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం అనేది ఆప్షన్‌. నగదు ఇస్తే ల్యాప్‌టాప్‌లకు మంగళం అని రాస్తారా? ట్యాబ్‌లను ప్రభుత్వం అదనంగా ఇస్తోంది. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ కోసం రూ.500 కోట్లు అదనంగా ఖర్చు పెడుతోంది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఇలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారా?   

ఇదేమైనా చిట్‌ఫండ్‌ కంపెనీనా..? 
టీడీపీ హయాంలో పోలవరం కాంట్రాక్టర్‌ ఎక్స్‌టెన్షన్, కాంట్రాక్టర్‌కు ప్రభుత్వ బ్యాంకు గ్యారెంటీలు, లోన్లకు కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. పాత కాంట్రాక్టులు రద్దు చేసి తమవారికి కట్టబెట్టేందుకు జీవోలిచ్చారు. టీడీపీ హయాంలో కేబినెట్‌ నిర్ణయాలు అన్నీ ఇలాంటివే. పేదలకు ఒరిగింది శూన్యం. కాగ్, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి లేఖలు రావడం సహజమే.

ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నిధులు అదృశ్యం కావడం టెక్నికల్‌ సమస్య అని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఏ ప్రభుత్వమైనా అలా రూ.800 కోట్లు తీసుకుని ఎగ్గొట్టగలదా? ఇదేమైనా చిట్‌ఫండ్‌ కంపెనీనా..? లేక మార్గదర్శి ఫైనాన్స్‌ కంపెనీనా..?  చంద్రబాబు అధికారం కోల్పోయారనే దుగ్ధతో వ్యవస్థపైనే దుష్ప్రచారం చేయడం దారుణం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement