ఈ రాష్ట్రాన్ని తమిళులు తప్ప ఎవరూ పాలించలేరు: రాహుల్‌

Rahul Gandhi dances with school students in Tamil Nadu - Sakshi

తమిళనాట రాహుల్‌ మాట

సాక్షి, చెన్నై: తమిళనాడులో రాహుల్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కన్యాకుమారిలోని ఓ కళాశాలలో విద్యార్థినులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. బస్కీలు తీశారు. నాగర్‌కోయిల్‌ జిల్లాలో రాహుల్‌ మాట్లాడుతూ తమిళ ప్రజలు తప్ప తమిళనాడుని ఎవ్వరూ పాలించలేరన్నారు. నిజంగా తమిళ ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారిదే విజయమని, వారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని రాహుల్‌ స్పష్టం చేశారు. మోదీ దగ్గర తలవంచిన తమిళ సీఎం పళని రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేరన్నారు.

ఏ ముఖ్యమంత్రి అయినా, తమ రాష్ట్ర ప్రజలకు వినమ్రతను ప్రదర్శించాలని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, మోదీ తమిళ భాషను, తమిళ సంస్కృతిని అవమానించారని, ఈ రాష్ట్రంలో వారిని అడుగుపెట్టనివ్వొద్దని రాహుల్‌ తమిళ ప్రజలను కోరారు. మోడీ ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర, ఒకే జాతి, ఒకే నాయకుడి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మరి తమిళం దేశ భాష కాదా? బెంగాలీ భాష దేశ భాషకాదా? తమిళ సంస్కృతి, బెంగాల్‌ సంస్కృతి ఈ దేశ సంస్కృతి కాదా? అని రాహుల్‌ సూటిగా ప్రశ్నించారు. భారత దేశంలోని అన్ని భాషలను, తమిళ భాషను, సంస్కృతినీ, చరిత్రను కాపాడటం తన కర్తవ్యం అని రాహుల్‌ చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లాగే రాష్ట్రంలో పళని స్వామి ప్రభుత్వం తమిళ ప్రజల భాషని గౌరవించడం లేదన్నారు.

విభిన్న భాషా, సంస్కృతికి విరుద్ధంగా ‘‘ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే చరిత్ర’’అనే సిద్ధాంతాన్ని ముందుకు తెస్తోన్న వారిని దూరంగా ఉంచడంలో తమిళనాడు దేశానికి ఆదర్శంగా నిలవాలని  అన్నారు.   కన్యాకుమారిలోని ములగుమూడులో స్కూల్‌ విద్యార్థులతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్షను తమిళనాడు రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయని, నీట్‌ పరీక్ష విద్యార్థులకు ఉపయోపడేది కాదని రాహుల్‌ అన్నారు. స్కూల్‌కి రావడానికి ముందు కొందరు విద్యార్థులతో కలిసి టీ తాగిన రాహుల్, వారిలోని ఒక విద్యార్థి వ్యోమగామి కావాలనుకోవడం చాలా మంచి విషయమని అన్నారు.

అతడిని స్పేస్‌ స్టేషన్‌లోకి అనుమతించాల్సిందిగా కోరతూ ఇస్రో చైర్మన్‌కి లేఖ రాస్తానన్నారు. రాహుల్‌తో మాట్లాడిన విద్యార్థులు రాహుల్‌ని అన్నా అని సంబోధిస్తూ, మీరు మీ ఆరోగ్యం కోసం ఏమైనా ప్రత్యేక డైట్‌ తీసుకుంటారా అని ప్రశ్నించారు. దానికి రాహుల్‌నేను రన్నింగ్‌ చేస్తాను, స్విమ్మింగ్, సైక్లింగ్‌ కూడా చేస్తానని సమాధానమిచ్చారు. నేను అకిడో మార్షల్‌ ఆర్ట్‌ కూడా నేర్చుకున్నానని రాహుల్‌ చెప్పారు. అలాగే, జపాన్‌ అకిడో మార్షల్‌ ఆర్ట్‌లో వారికి ఓ టెక్నిక్‌ని ప్రదర్శించి చూపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top