ఫేస్‌బుక్‌ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్‌

Rahul Gandhi attacks BJP over Wall Street Journal report on Facebook - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం రాజకీయ వేడిని పుట్టించింది.  ‘విద్వేషపూరిత ప్రసంగాల నిబంధనల విషయంలో భారత రాజకీయ నాయకులతో ఫేస్‌బుక్‌ రాజీపడుతోంది. వివాదాస్పద రాజకీయ నాయకుడిపై నిషేధం విధించడానికి ఫేస్‌బుక్‌ ఎగ్జిక్యూటివ్‌ నిరాకరించారు. బీజేపీ నేతల ఉల్లంఘనలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. వారిపై చర్యలకు దిగితే భారత్‌లో కంపెనీ వ్యాపారావకాశాలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నారు.

బీజేపీవైపు ఫేస్‌బుక్‌ మొగ్గుచూపుతోంది’అని ఈ సామాజిక మాధ్యమ సంస్థ ప్రస్తుత, మాజీ ఉద్యోగులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో రాసింది.  ఈ కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌చేస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బీజేపీపై ధ్వజమెత్తారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయి. వీటి ద్వారా తప్పుడు వార్తలను, విదేష్వాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి. చివరకు అమెరికా మీడియా నిజాన్ని బయటపెట్టింది’అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. విద్వేష ప్రసంగాల విషయంలో ఏం చేయదలచుకున్నారో ఫేస్‌బుక్‌ చెప్పాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top