అక్కడ పేదలు ఉండకూడదా?  | Perni Nani Fires On Chandrababu Yellow Media | Sakshi
Sakshi News home page

అక్కడ పేదలు ఉండకూడదా? 

Sep 9 2022 5:09 AM | Updated on Sep 9 2022 7:04 AM

Perni Nani Fires On Chandrababu Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: ‘రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా? కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మాత్రమే జరగాలా? అమరావతి మీ ఒక్కరి సొత్తా?’ అని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని).. చంద్రబాబును, ఎల్లో మీడియాను నిలదీశారు. సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, సీఎం జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘రాజధానిలో పేదలు, బడుగులు ఉండకూడదా? కేవలం మీ వర్గం వారే ఉండాలా? ఇతరులు రావొద్దా? అలాంటప్పుడు అది రాష్ట్ర రాజధాని ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు. బాబు పాలనలో దోచుకుని దాచుకోవడం పనిగా పెట్టుకున్నారని, రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని నిప్పులు చెరిగారు. నాని ఇంకా ఏమన్నారంటే.. 

అడుగడుగునా విషం చిమ్ముతున్నారు.. 
► నిరుపేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బుధవారం  మంత్రివర్గం నిర్ణయించడంతో, దుష్టచతుష్టయం గురువారం దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ. కానీ ఇక్కడ చంద్రబాబుకు, రామోజీరావుకు, రాధాకృష్ణకు మాత్రం రాజధాని అంటే కేవలం వారికి సంబంధించింది మాత్రమే.  
► అందుకే ఏబీఎన్‌ రాధాకృష్ణ, రాజధానిపై బుధవారం మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ దారుణంగా రాశారు. అంత పచ్చిగా, దారుణంగా విషం చిమ్మడం మీకు తప్ప.. ఇతర మానవమాత్రులకు సాధ్యం కాదు.   
► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నిరుపేదలకు, ఇళ్లు లేని వారికి ఇక్కడ ఇళ్లు, భూములు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందా? అంటే నిరుపేదలు.. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఇక్కడ ఉండకూడదా?  ఈనాడులో కూడా దారుణంగా రాశారు. చివరకు పేపర్‌ నడుపుతోంది సీఎం జగన్‌పై విషం చిమ్మడానికే అన్నట్లుగా ఉంది.  
► చంద్రబాబు తన ఇష్టం వచ్చిన వారికి వేల ఎకరాలిచ్చినా ఎల్లో మీడియాకు కనబడదా? అమరావతిలో ఎందరికో భూములిచ్చారు. చివరకు గన్నవరం విమానాశ్రయం వద్ద తనకు కావాల్సిన వారుంటే, వారికీ ఇక్కడే భూములిచ్చారు.

దౌర్భాగ్య చరిత్ర ఎవరిది? 
► పాదయాత్ర పేరుతో మళ్లీ డ్రామాలకు తెర తీశారు. పాదయాత్రకు కలెక్షన్‌ ఫుల్‌. సానుభూతి మాత్రం నిల్‌. ఉద్యమం పేరుతో యథేచ్ఛగా వసూళ్ల రాజకీయం చేస్తున్నారు.  
► రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబు కాదా? రైతులకు విత్తన బకాయిలివ్వకుండా ఇబ్బంది పెట్టింది చంద్రబాబు కాదా? వరుసగా నాలుగేళ్లు పంట నష్టం ఎగ్గొట్టిందెవరు? టీడీపీ ప్రభుత్వం కాదా? సీఎం జగన్‌ సంక్షేమం ఇలాగే కొనసాగితే తమకు పుట్టగతులుండవని ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. 8 చంద్రబాబు భూములు అమ్మినా సమర్థించారు. ఆయన 600 హామీలిచ్చి, కనీసం 10 కూడా నెవవేర్చకున్నా శూరుడు, వీరుడన్నారు. ఇచ్చిన హామీల్లో మూడేళ్లలోనే 95 శాతం సీఎం జగన్‌ అమలు చేసినా, అవి మాత్రం మీకు కనిపించవు.  
► చంద్రబాబు పదవి దిగిపోయే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉన్నాయి. ఆ విషయం ఈనాడులోనే రాశారు. అయినా సీఎం జగన్‌ నిలదొక్కుకున్నారు. ఎక్కడా, ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఐఆర్‌ ఇచ్చారు.  
► 2014 నుంచి 2019 వరకు ఒక్క మార్చి నెలలోనే రూ.40 వేల కోట్ల అప్పులు చేసిన దౌర్భాగ్య చరిత్ర ఎవరిది? వెళ్తూ వెళ్తూ కాంట్రాక్టర్లకు రూ.42 వేల కోట్లు బాకీ పెట్టిపోయిందెవరు?   

ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు.. 
► విత్తనాలు సేకరించి, రైతులకు ఆ డబ్బులు రూ.800 కోట్లు కూడా ఇవ్వకుండా పోయిందెవరు? ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వకుండా రూ.1,200 కోట్లు ఎగ్గొట్టి పోయిందెవరు? నాలుగేళ్లు పంట నష్టం పరిహారం చెల్లించకుండా పోయింది బాబు కాదా?  
► ఇన్ని ఆర్థిక సమస్యల మధ్య, అనివార్య పరిస్థితుల్లోనే సీపీఎస్‌ బదులు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయలేక పోతున్నామని, అర్థం చేసుకుని.. తమ ప్రతిపాదనలను అంగీకరించాలని సీఎం జగన్‌ ఉద్యోగులను కోరుతున్నారు. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. 
► చంద్రబాబుకు ఒక విజ్ఞప్తి. మీ వయస్సు మీ అనుచరులు చెప్పిన దాని ప్రకారం 79 ఏళ్లు. సర్టిఫికెట్‌ ప్రకారం 74 ఏళ్లు. ఈ పరిస్థితిలో నీ కొడుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, కిరాయి వ్యక్తులతో ట్వీట్లు పెట్టించడం  మీకే నష్టం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement