చేతులు కలిపారు

Navjot Singh Sidhu Takes Charge As Punjab Congress Chief - Sakshi

కలసికట్టుగా పనిచేస్తామన్న అమరీందర్, సిద్ధూ

సిద్ధూ కొత్త ఇన్నింగ్స్‌

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ

చండీగఢ్‌ : పంజాబ్‌ కాంగ్రెస్‌లో గత కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూల మధ్య నెలకొన్న విభేదాలకు తెరపడ్డాయి.  నేతలిద్దరు చేతులు కలిపి రాష్ట్ర సంక్షేమం కోసం కలిసి పనిచెయ్యాలని నిర్ణయించారు. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం అమరీందర్‌   హాజరయ్యారు. సిద్ధూకి ఆ పదవి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ గురువారం సిద్ధూ అమరీందర్‌కి ఈ కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తూ  లేఖ రాశారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ కుటుంబంలో మీరే పెద్ద వారని పేర్కొన్నారు. దీంతో అమరీందర్‌ వెనక్కి తగ్గారు.  

అందరితో కలిసి పనిచేస్తా : సిద్ధూ  
పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఇప్పడు ఐక్యంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ నెగ్గేలా పని చేస్తామని అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతన్నలకు అండగా ఉంటామన్నారు.  ‘‘నాకు ఇగో లేదు. నేను పార్టీ కార్యకర్తల భుజంతో భుజం కలిపి పని చేస్తాను. నా కంటే వయసులో చిన్నవారిని ప్రేమిస్తాను. పెద్దవారిని గౌరవిస్తాను. పంజాబ్‌ గెలుస్తుంది, పంజాబీలు గెలుస్తారు’’అంటూ గట్టిగా నినదించారు. తననెవరైతే వ్యతిరేకించారో వారే తాను మెరుగ్గా పని చేయడానికి సహకరిస్తారని పేర్కొన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ తామిద్దరం రాష్ట్ర సంక్షేమం కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.  

సర్, ఎలా ఉన్నారు ? 
అంతకు ముందు పంజాబ్‌ భవన్‌లో సీఎం అమరీందర్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ హాజరయ్యారు. ఈ సమయంలో సీఎం దగ్గరగా వచ్చిన సిద్ధూ నమస్కరిస్తూ ఎలా ఉన్నారు సర్‌ అని పలకరించారు.  వారిద్దరూ పక్కపక్కనే సీట్లలో కూర్చున్నారు.  ఆ తర్వాత సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా ఇద్దరూ పక్క పక్క సీట్లలోనే కూర్చున్నారు. నాలుగు నెలల తర్వాత సిద్ధూ, సీఎం అమరీందర్‌ కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ రెండు కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ హరీష్‌ రావత్‌ పాల్గొన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top